మొత్తానికి హస్తవాసి బాగానే ఉన్నట్లుంది. కన్నడ నాట ఫలితాలు వచ్చాయి. ఒక్క శివమొగ్గ తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కైవశం చేసుకుంది. శివమొగ్గలో మాజీ సీఎం యెడ్యూరప్ప కుమారుడు గెలిచి బీజేపీ పరువు కాపాడాడు. మాండ్యా లోక్ సభ సీటుతో పాటు, బల్లారి వంటి ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటు కూడా బీజేపీ కోల్పోయింది. ఇక రెండు అసెంబ్లీ సీట్లూ కాంగ్రెస్, జేడీఎస్ కూటమి పరం అయ్యాయి. ఈ ఫలితాలు అయిదు రాష్ట్రాల ఎన్నికలపైన ప్రభావం చూపుతాయా ప్రత్యేకించి తెలంగాణాలో ఏమవుతుంది..ఇదే ఇపుడు వేడి వాడి చర్చ


తెలంగాణాలో షాకేనా :


ఈ ఫలితాలు జోరు చూస్తూంటే బీజెపీకి గట్టి షాక్ తప్పదని తెలుస్తోంది. తెలంగాణాలో బీజేపీ మొత్తం సీట్లకు పోటీ చేస్తోంది. అయితే కన్నడ నాట ఫలితాలను చూసి బీజేపీ బేజారయ్యేలా ఉంది. మేమే గెలుస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా  ప్రదర్శిస్తున్న బీజేపీకి చేదు ఫలితాలు మింగుడు పడడంలేదు. బీజేపీ మీద ఇంత వ్యతిరేకత ఉందా అనిపించేలా ఫలితాలు వచ్చాయని అంటున్నారు. మోడీ విధానాలకు ఈ ఫలితాలు ప్రతిబింబమని కూడా చెబుతున్నారు.


టీయారెస్ లో  గుబులు :


ఇక కన్నడ ఫలితాలు చూస్తే తెలంగాణాలో టీయారెస్ కి గుబులు పుడుతోందని అంటున్నారు. ఈ ఫలితాల వల్ల ఇక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ కి కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. అపుడు ఆ పార్టీకి అనుకూల వాతారవణం ఏర్పడితే  ఆపడం కష్టమేనని కూడా భావిస్తున్నారు. మరో వైపు దేశంలో అయిదు రాష్ట్రాలలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోడీ వ్యతిరేక గాలి వీస్తోంది. అది మరో వైపు కాంగ్రెస్ కి ప్లస్ అవుతోందని అటువంటి తరుణంలో ఆ ప్రభావం కూడా తెలంగాణా మీద పడితే ఇబ్బందులు తప్పవని కూడా గులాబీ పార్టీ బెంబేలెత్తుతోంది. 


మహా కూటమిలో హుషార్ :


మరో నెల రోజుల్లో తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న వేళ కన్నడ నాట ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా రావడంతో మహా కూటమి నేతలు తెగ హుషార్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి రేపటి తెలగాణా ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని కూడా ధీమాగా చెబుతున్నారు. కూటమికి పెద్దన్న కాంగ్రెస్ లో అయితే పట్టరాని ఆనందం కలుగుతోందట. టీయారెస్ మీద వ్యతిరేకత, బీజేపీ మీద ఉన్న కోపం వెరసి తమకు పూర్తిగా తెలంగాణాలో అనుకూలిస్తుందని సంబరాలు చేసుకుంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతొందో.


మరింత సమాచారం తెలుసుకోండి: