అగ్రిగోల్డ్ వివాదం మొత్తాన్ని కేంద్రం మెడకు చుట్టి తప్పించుకోవాలని చంద్రబాబునాయుడు చూస్తున్నట్లు  కనబడుతోంది. ఎందుకంటే, ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి అవసరమయ్యే మొత్తంలో 75 శాతం కేంద్రం భరించాలని తీర్మానించటమే అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.  ప్రస్తుత పరిస్ధితుల్లో కేంద్రం నుండి రాష్ట్రం అంత పెద్ద మొత్తంలో ఆర్ధిక సాయం అందేపనేనా ? ఎలాగూ అందే అవకాశాలు లేవుకాబట్టే క్యాబినెట్ కూడా ఆ విధంగా తీర్మానం చేసేసింది. రేపేదైనా సమస్య వస్తే నెపాన్ని కేంద్రం మీదకు నెట్టేయొచ్చనే కుట్రే కనబడుతోంది.

 

అగ్రిగోల్డ్ సమస్య గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.   చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే అగ్రిగోల్డ్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఆ వివాదం చుట్టూ ముసురుకున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఏవేవె కంపెనీలు ముందుకు రావటం మళ్ళీ వెనక్కుపోవటంతోనే సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. అగ్రిగోల్డ్ బాధితులు ఆరు రాష్ట్రాల్లో ఉన్నారు. సుమారు 19 లక్షల ఖాతాదారులు, 30 లక్షలకు పైగా ఖాతాలున్నాయి. దాదాపు రూ 8 వేల కోట్ల కుంభకోణంగా ప్రభుత్వం చెబుతున్నా నిజానికి ఇందులో కుంభకోణం ఏముందో ప్రభుత్వమే ఇఫ్పటి వరకూ చెప్పలేకపోయింది. కుంభకోణమనే ముద్రవేసి అగ్రిగోల్డ్ గ్రూపు మొత్తాన్ని ప్రభుత్వం మూసేసింది.

 

దాదాపు మూడు సంవత్సరాలకుపైగా ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై ఏదో కంటితుడుపులాగే వ్యవహరించింది. అటువంటిది చివరకు ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో హడావుడిగా క్యాబినెట్లో చర్చించటమేంటో అర్ధం కావటం లేదు. పైగా ఖాతాదారులకు పంచాల్సిన మొత్తంలో 75 శాతం కేంద్రం భరించాలని నిర్ణయించటమేంటో అర్ధం కావటం లేదు. ఈ సమస్య మొత్తం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదే అయినా కేంద్రాన్ని వివాదంలోకి లాగుతున్నారు చంద్రబాబు. ప్రతీ జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీలతో త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయం ఇంతకుముందే ఎందుకు తీసుకోలేదు ? అసలు అగ్రిగోల్డ్ ఆస్తులపై అధికార పార్టీ నేతల కన్నే పడిందని జరిగిన ప్రచారం కూడా  అందరికీ తెలిసిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: