ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డానికి కార‌ణం ఎవ‌రు ?  దాదాపు ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న చంద్ర‌బాబు కు జ‌వ‌స‌త్వాలు ఇచ్చి.. మా బాబు మ‌ళ్లీ రావాలి! అని నిన‌దించి.. ఆయ‌న‌ను సీఎం సీటు ఎక్కించే వ‌ర‌కు నిద్ర‌పోనిది ఎవ‌రు?.. ఈ రెండు ప్ర‌శ్న‌లు చాలు.. చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ అధికారంలోకి ఎలా వ‌చ్చాయో చెప్ప‌డానికి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, శ్రేణులు.,. యుద్ధ ప్రాతిప‌దికన క‌దిలి.. బాబును అధికారంలోకి తెచ్చారు.  ఈక్ర‌మంలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు.. చాలా త్యాగాలే చేశారు. ఆర్ధికంగా పార్టీకి పెట్టుబ‌డులు పెట్టిన వారు కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. పార్టీ అధినేత‌గా, సీఎంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హార స‌ర‌ళి చూస్తే.. మాత్రం భిన్నంగా క‌నిపిస్తోంది.


చంద్ర‌బాబులో కాన్ఫిడెన్స్‌కు బ‌దులు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు పోతున్నార‌ని అనిపిస్తోంది. త‌న కోసం, పార్టీ కోసం ప‌నిచేసిన నాయ‌కుల‌ను ఆయ‌న ఇప్పుడు బెదిరింపు ధోర‌ణిని అనుస‌రిస్తూ.. అవ‌మానిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ప్రజల్లో ఉండాలనుకుంటేనే ఇక్కడ ఉండండి.. తిరగలేకపోతే ఆ మాట చెప్పి పక్కకు తప్పుకోండి. లేకపోతే నేనే తప్పించాల్సి వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను కటువుగా హెచ్చరించినట్లు తెలిసింది. ‘కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగితే గ్లామర్‌ తగ్గుతుందనుకుంటున్నారు. కందిపోకూడదని అనుకుంటే తర్వాత అసలుకే మునిగిపోతారు. చాలా మంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదు. జనంతో మమేకమవడం రాజకీయ నాయకుడి లక్షణం. గ్లామర‌స్‌గా ఉండాలనుకుంటే వేరే రంగంలోకి వెళ్లండి’ అని స్పష్టం చేశారు.


దీంతో ఒక్క‌సారిగా పార్టీలో సీనియ‌ర్లు మండి ప‌డుతున్నారు. ఆఫ్‌ది రికార్డుగానే అయినా.. బాబు వ్య‌వ‌హార శైలిని వారు త‌ప్పుప‌డుతున్నారు. పార్టీలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో 40 మంది వ‌ర‌కు వృద్ధులు ఉన్నారు. వీరిలో అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా బాబు అలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌నేది వీరి ఆవేద‌న‌. పైగా.. చంద్ర‌బాబుతో పాటు స‌మానంగా రాజ‌కీయాల్లో తిరుగుతున్న‌వారు కూడా ఉన్నారు. వారికి తెలియ‌దా?  ఎప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలో? అనే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమ‌యంలోనే 2014 ఎన్నిక‌ల‌ను వారు గుర్తు చేసుకుంటున్నారు.  అప్ప‌ట్లో బాబు కోసం మేం ఎంత క‌ష్ట‌ప‌డ్డామో.,. వీధి వీధి తిరిగి ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించామో.. చంద్ర‌బాబు మ‌రిచిపోయిన‌ట్టున్నార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామమే ఇప్పుడు బాబు కాన్ఫిడెన్స్ కు పోతున్నారా?  లేక ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్తున్నారా? అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: