2014 ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సంచలన విజయం సాధించిన ఆ మహిళా నాయకురాలు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను గెలిచిన పార్టీకి దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీకి రెడీ అవుతున్న ఆమె ఆశలపై తాజా రాజకీయ పరిణామాలు నీళ్లు చల్లాయి. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే రేణుక ఎంపీగా గెలిచిన వారం రోజులకే ఆమె భర్త చంద్రబాబును కలిసి టిడిపి కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె పార్టీ మారిన ప్రచారం జరిగినా రెండేళ్ల పాటు ఊరించి ఊరించి ఎట్టకేలకు జగన్ తో విభేదించి టిడిపికి దగ్గరయ్యారు.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన ఆమె.. జ‌గ‌న్ ఇవ్వ‌న‌న‌డంతోనే పార్టీ కి గుడ్‌బై చెప్పార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎంపీగా గెలిచిన రేణుకకు ఆ పదవి వల్ల ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయం బలంగా కలిగింది. ఈ క్రమంలోనే ఆమె వచ్చే ఎన్నికల్లో తన చేనేత సామాజిక వర్గం బలంగా ఉన్న ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించారు. అయితే అక్కడ వైసీపీ నుంచి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బలంగా ఉంది. ఎర్రకోట ఫ్యామిలీ రేణుకను అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు దీంతో అసెంబ్లీకి పోటీ చేయాలన్న వైసీపీలో ఉంటే నెరవేరేలా కనపడలేదు.


ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆ టికెట్‌ను ఇస్తాన‌ని చెప్ప‌డంతో వ్యూహాత్మ‌కంగా పార్టీ మారిపోయారు. అయితే, మ‌ళ్లీ కొన్నాళ్ల‌కు ఎమ్మిగ‌నూరులో పోటీ ఎక్కువ‌గా ఉంద‌ని, టికెట్ క‌ష్ట‌మ‌ని బాబు బుజ్జ‌గించారు. దీంతో పెద్దాయ‌న మాట కాద‌నేలేక ఎంపీ సీటుకే తిరిగి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇక్క‌డరాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు చాలా వేగంగా మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు కుదిరితే కర్నూలు ఎంపీ బుట్టా రేణుక త్యాగం చేయక తప్పని పరిస్థితి అని తెలుస్తోంది. 2014లో బీజేపీకి ఎలా కేటాయించిందో అదే విదంగా ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా చంద్ర‌బాబు టికెట్లు కేటాయించే ప‌రిస్థితి ఉంటుంది. దీనిని బ‌ట్టి క‌ర్నూలు ఎంపీ సీటుపై ఎప్ప‌టి నుంచో ఆశ‌లు పెట్టుకున్న  కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్ర కాష్‌రెడ్డికి టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉంది. 


ఇది జ‌రిగితే.. సాంకేతికంగా బుట్టా ఇక‌, క‌ర్నూలు టికెట్‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంది. అయితే, అదేస‌మ‌యంలో బుట్టా రేణుక క‌ల‌లు కంటున్న ఎమ్మిగ‌నూరు అసెంబ్లీల టికెట్‌ను చంద్ర‌బాబు ఇస్తారా? అనేది కూడా సందేహంగానే క‌నిపిస్తోంది. ఇక్క‌డ పార్టీని అభివృద్ధి చేసి.. గెలుపు గుర్రం ఎక్కించిన ఎమ్మెల్యే జయ‌నాగేశ్వ‌ర‌రెడ్డి బ‌లంగా ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ఇక్క‌డ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల చూస్తే టిడిపి కాంగ్రెస్ పొత్తు ఏపీలో కూడా కుదిరితే కాంగ్రెస్ కచ్చితంగా కర్నూలు ఎంపీ సీటును కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోసం కోరుతుంది. ఇక రేణుక ఆశిస్తున్న ఎమ్మిగనూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆమె ఆశలు అక్కడ కూడా నెరవేరవు. ఓవ‌రాల్‌గా చూస్తే వచ్చే ఎన్నికల్లో రేణుక సీటు సంక్లిష్టంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: