తెలంగాణలో జరిగే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు టైమ్‌ మాత్రమే ఉంది. డిసెంబర్‌ 7వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా 11వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. తాజా మాజీ మంత్రులు హరిష్‌రావు, కేటీఆర్‌ ప్రచారాన్ని ముందుండి నడిపిస్తుంటే.. సీఎం కేసీఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా తనదైన వ్యూహాలు పన్నుతూ అభ్యర్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రచార పర్వంలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుంటే మహాకూటమి ఇంకా సీట్ల సద్దుబాటులోనే కొట్టుమిట్టాడుతోంది. మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, తెలంగాణ జనసమితిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు పంచుకోవాలన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. 


ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను గద్ది దింపాలన్న కసితో ఉన్న మహాకూటమి నుంచి పోటీ చేస్తున్న వారిలో పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలతో పాటు గతంలో ఎంపీలుగా పని చేసినవారు సైతం ఉన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎలాగైన గ‌ద్దె దించాలన్న లక్ష్యంతో తమకు పట్టున్న స్థానాల్లో మాజీ ఎంపీలు సైతం ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలో దిగుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారిలో కరీంనగర్‌ నుంచి కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, నారాయణ్‌ఖేడ్ నుంచి జహీరాబాద్‌ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌, మెదక్‌ నుంచి మెదక్‌ మాజీ ఎంపీ విజయశాంతి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో మెదక్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిన విజయశాంతి పేరు దుబ్బాకలో కూడా వినిపించినా ఆ సీటును తెలంగాణ జనసమితికి కేటాయించడంతో విజయశాంతి మెదక్‌ నుంచి పోటీ చెయ్యాల్సి రావొచ్చు. 


ఇక టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసి అక్కడ టిక్కెట్‌ దక్కకపోవడంతో అదిలాబాద్‌ మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్ ఖ‌నాపూర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యనున్నారు. రామేష్ రాథోడ్‌ పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సైతం గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరితో పాటు నాగర్‌ నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మల్లు రవి జడ్చ‌ర్ల నుంచి పోటీ చేసేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. మల్కాజ్‌గిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ నుంచి రంగంలోకి దిగనున్నారు. మహబూబాబాద్‌ మాజీ ఎంపీ పోరిక‌ బలరాం నాయక్‌ మహబూబాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుఖ చౌదరి ఖమ్మం అసెంబ్లీ రేసులో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని అనుకుంటున్నారు. 


అదే టైమ్‌లో టీడీపీకి చెందిన మాజీ ఎంసీ నామా నాగేశ్వరరావు సైతం పొత్తులో భాగంగా ఖమ్మం అసెంబ్లీ సీటును టీడీపీకి ఇస్తే ఆయన అక్కడ పోటీ చెయ్యవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స‌మావేశంలో ఈ మాజీ ఎంపీల పేర్లు ఖ‌రారు అయినట్టు తెలస్తోంది. వీరితో పాటు కోదండరాం లాంటి వాళ్లు సైతం పోటీకి రెడీ అవుతున్నారు. కోదండరాం పేరు రామగుండం నుంచి వినపడుతుంది. అలాగే తెలంగాణ తెలుగుదేశంలో ఇంకా మిగిలి ఉన్న సీనియర్లు అందరూ ఈ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులని ఓడించాలని కసితో ఉన్నారు. మరి ఈ ప్లాన్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో తెలియాలంటే వచ్చే నెల 11వరకు వెయిట్‌ చెయ్యాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: