ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొండా సురేఖ దంపతుల గురించి తెలియని రాజకీయ ఆసక్తి పరులు ఉండరు. దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అండతో సర్పంచ్‌ స్థాయి నుంచి ఎంపీపీ, ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి ఎదిగిన కొండా దంపతుల హావా వైఎస్‌ ఉన్నప్పుడు జిల్లాల్లో బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలతో వారి ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన సురేఖ 2012లో తన మంత్రి పదవిని సైతం వదులుకుని వైసీపీలోకి వెళ్లి పరకాల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె తెలంగాణ మొత్తం టీఆర్‌ఎస్‌ హవా వీస్తున్నా పరకాలలో గట్టి పోటీ ఇచ్చి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. 


గత ఎన్నికలకు ముందు ఆమె వైసీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసి తన సొంత నియోజకవర్గం అయిన పరకాలను వదిలి వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 55 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నా మంత్రి పదవి వస్తుందని కొండా దంపతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు అడిఆశలే అయ్యాయి. ఐదేళ్ల పాటు టీఆర్‌ఎస్‌లో కక్కలేక మింగలేక అన్న చందంగా కాలం గడుపుకొచ్చిన కొండా దంపతులకు చివరకు కేసీఆర్‌ టిక్కెట్‌ సైతం పెండింగులో పెట్టారు. ఈ క్రమంలో వారు రాహుల్‌ సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల  గ్యాప్‌ తర్వాత తమ సొతం నియోజకవర్గం పరకాల నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీకి రెడీ అవుతున్నారు. 

Image result for trs mla challa dharma reddy

ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు నెల రోజులుగా పరకాల నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం చేస్తు జనాల్లోకి దూసుకుపోతున్నారు. కొండా దంపతులకు పరకాల నియోజకవర్గంలో ఒకప్పుడు బలమైన అనుచర గణం ఉండేది. అయితే కొండా దంపతులు కాంగ్రెస్‌ నుంచి వయా వైసీపీ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి రావడంతో పాటు పరకాలను వదిలి వరంగల్‌ ఈస్ట్‌కు వెళ్లిపోవడంతో ఇక్కడ కేడర్‌ కాస్త చల్లాచెదురు అయ్యింది. కొండా దంపతులకు వెన్నుద‌న్నుగా ఉండే కేడర్‌లో చాలా మందిని సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా దర్మారెడ్డి తనవైపునకు తిప్పుకున్నారు. కొండా దంపతులు ఐదేళ్ల పాటు పరకాలకు దూరంగా ఉండడంతో నియోజకవర్గంపై పట్టు కోల్పోయారు. అదే టైమ్‌లో టీడీపీలో గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన చల్లా ధ‌ర్మారెడ్డికి ఇక్కడ మంచి అనుచర గణం ఉంది. 


కొండా వర్గంలో బలమైన నేతలను తన అనుచరులుగా మార్చుకున్న ఆయన నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉంటారన్న పేరు సంపాదించుకోవడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కొండా దంపతులు తిరిగి ఇప్పుడు పనకాలకు వచ్చినా వారి సన్నిహితులంతా తన వద్దే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంలో ధ‌ర్మారెడ్డి సక్సెస్‌ అయ్యారు. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొండా దంపతులు పరకాలపై పట్టు సాధించేందుకు ముప్ప తిప్పలు పడుతున్నారు. నెల రోజుల క్రితం నుంచే పలు ప్రచారం ప్రారంభించారు. ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు గ్రామాల్లో పట్టు పెంచుకొనే ప్రయత్నాల్లో మునిగిపోయారు. తాము గతంలో సుదీర్ఘంగా ఇక్కడ ప్రాధినిత్యం వహించడంతో తమకు ఉన్న పరిచయాలతో జనాల్లోకి దూసుకుపోతున్నా, కొంత మందిని తనవైపుకు తిప్పుకుంటున్నా గతంలో ఉన్నట్టుగా పోలిస్తే పరిస్థితులు ఇప్పుడంత సానుకూలంగా లేవని తెలుస్తోంది. 

Related image

టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ను, ఆయన తనయుడు యువనేత కేటీఆర్‌ను సవాల్‌ చేసి టీఆర్‌ఎస్‌ నుంచి భ‌యటకు వెళ్లిన కొండా దంపతులను ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం సైతం పరకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ సైతం ఇక్కడ తమ పార్టీ అభ్యర్థి చల్లా ధ‌ర్మారెడ్డికి గైడెన్స్‌ ఇస్తున్నారు. ఎలాగైనా కొండా దంపతులకు చెక్‌ పెట్టాలని టీఆర్‌ఎస్‌ గట్టి ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పటికే ఐదేళ్ల పాటు వరంగల్‌ ఈస్ట్‌లో అధికార పార్టీలో ఉండి కూడా పట్టు సాధించలేక తమ మాట నెగ్గించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడిన కొండా దంపతులకు ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తేనా కొండా దంపతులకు కాంగ్రెస్‌లో క్రేజ్‌ ఉంటుంది, వారికి రాజకీయ మనుగడ ఉంటుంది. 


తాజా ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కొండా దంపతులు అన్ని అస్త్రశస్త్రలను ఉపయోగిస్తున్నారు. మరో వైపు కొండా సురేఖ భర్త కొండా మురళీ సైతం నియోజకవర్గంలో గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటున్నారు. ఏదేమైన నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొండా దంపతుల కంటే చల్లా ధ‌ర్మారెడ్డికే కాస్త ఎడ్జ్‌ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఎన్నికల వేల ఈ పరిణామాలు తమకు అనుకూలంగా  మార్చుకోవడంలో కొండా దంపతులది అందివేసిన చేయి. ఈ విషయాన్ని కూడా తక్కువ చేసి చూపలేమని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏదేమైన పరకాలలో హోరా హోరీ పోరు అయితే ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: