ఏపీ సీఎం చంద్రబాబు ఆపరేషన్‌ ఆకర్ష్‌ నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన ఒకరిద్దరు ఎంపీలతో పాటు 23 మంది ఎమ్మెల్యేలను సైకిల్‌ ఎక్కించేసుకున్నారు. వీరు పార్టీలు మారిన నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువా అయితే కప్పేరు గాని క్షేత్ర స్థాయిలో మాత్రం టీడీపీ బలోపితం కాలేదు. వైసీపీ క్షేత్ర స్థాయిలో చాలా బలంగా ఉన్నా కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు పసుపు కండువాలు కప్పేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఈ రెండు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వైసీపీ చాలా స్ట్రాంగా ఉంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జిల్లాలో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు సైకిల్‌ ఎక్కేశారు. వీరు సైకిల్‌ ఎక్కేశారు అనడం కంటే చంద్రబాబు, టీడీపీ నాయకులు వీరిని బలవంతగా సైకిల్‌ ఎక్కించేశారు. బలవంతంగా పార్టీ మారినవారు, అవసరాల కోసం పార్టీ మారినవారు ఇప్పుడు టీడీపీలో ఇమడలేకపోతున్నారు. 


కొన్ని చోట్ల కొత్త, పాత నేతల మధ్య‌ ఏ మాత్రం పొసగ‌టం లేదు. ఉదాహరణకు అద్దంకి పరిస్థితే చూస్తే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు గత ఎన్నికల్లో రవి చేతుల్లో ఓడిన కరణం మధ్య‌ ఎలాంటి యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా ఉంటే టీడీపీలో ఇమడలేనివారు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉండి కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన మాగుంట ఫ్యామిలీ గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చేసింది. ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం సెగ్మెంట్లలో వైసీపీకి వచ్చిన భారి మెజారిటీతోనే శ్రీనివాసుల రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. 


వచ్చే ఎన్నికల్లో మరో సారి ఎంపీగా టీడీపీ నుంచి పోటీకి రెడీ అవుతున్న మాగుంట అభిప్రాయాలను కొండపి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పట్టించుకోవడం లేదని మాగుంట సీరియస్‌గా ఉన్నారు. తాను ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు ఉంటేనే తన గెలుపు సులువు అవుతుందన్నది మాగుంట నమ్మకం. ఇది వాస్త‌వం కూడా. అయితే చంద్రబాబు మాగుంట చెప్పినట్టు మూడు, నాలుగు సీట్లు మార్చేందుకు సుముఖ‌త వ్యక్తం చెయ్యడం లేదు. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న లీడ‌ర్లు మాగుంటను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కొద్ది రోజులుగా పేరుకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన కార్యక్రమాలన్నీ జిల్లాలో నామ్‌కే వాస్తేగా మారాయి. 


ఈ క్రమంలోనే ఆయన టీడీపీ వీడే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన మాగుంటకు జగన్‌ ఒంగోలు ఎంపీ సీటు ఆఫర్‌ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్‌ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యరని తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యకలాపాల కోసం వాడుకోవాలని జగన్‌ డిసైడ్‌ అయ్యి ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ మారినా మాగుంటకి ఎంపీ సీటు విషయంలో డోకా అయితే లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: