నిజంగా ఎన్టీయార్ ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో కదా ? సినిమాల్లో దశాబ్దాలపాటు ఓ వెలుగు వెలిగిన అన్నగారు రాజకీయాల్లో మాత్రం చతికిలపడ్డారనే చెప్పాలి. తెలుగుదేశంపార్టీ పెట్టిన తొమ్మిది మాసాలకే అధికారంలోకి రావటం నిజంగా సంచలనమనే చెప్పుకోవాలి. కానీ తర్వాత జరిగినవేవీ ఎన్టీయార్ ఇమేజిని పెంచేవి కావు. 1995లో పదవి నుండి దింపేయటం అందునా కుటుంబసభ్యుల మద్దతుతో స్వయానా అల్లుడు చంద్రబాబునాయుడే వెన్నుపోటు పొడిచి దింపేయటం నిజంగా బాధాకరమనే చెప్పాలి.

 

టిడిపి పెట్టిన దగ్గర నుండి ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఎన్టీయార్ పోరాటాలు చేశారో అదే పార్టీతో ప్రస్తుతం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అంతకుముందే ఎన్టీయార్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు సార్లు విశాఖపట్నం ఎంపిగా గెలిచి ఒకసారి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక, సినీ వారసుడు నందమూరి బాలకృష్ణ తండ్రికి బావగార్లు వెన్నుపోటు పొడవటంలో దగ్గరుండి మరీ సహకరించారు. జీవిత చరమాంకంలో ఎన్టీయార్ వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైసిపిలో పనిచేస్తున్నారు.

 

అంటే ఎన్టీయార్ టిడిపి స్ధాపించినపుడు పార్టీలోనే ఎదిగిన వారంతా చివరకు ఒక్కో పార్టీలో కుదురుకున్నారు. కొడుకు బాలకృష్ణ టిడిపిలో హిందుపురం ఎంఎల్ఏగా ఉన్నారు. కూతురు పురంధేశ్వరి బిజెపిలో యాక్టివ్ గా ఉన్నారు. భార్య లక్ష్మీపార్వతి  వైసిపి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నారు.


ఇక్కడ విచిత్రమేమిటంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా అవసరానికి  అందరూ ఎన్టీయార్ జపం చేస్తున్నారు, ఫొటోను వాడుకుంటున్నారు. కొడుకు, కూతురు, అల్లుళ్ళు  అంతా కలిసే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచారు. అందరూ కలిసి ఎన్టీయార్ ను పదవిలో నుండి దింపేసి, మనోవ్యధతో మరణానికి కారకులయ్యారు. కానీ  అవసరమైనపుడల్లా మళ్ళీ ఎన్టీయార్ ఫొటోను ముందు పెట్టుకునే రాజకీయం చేస్తున్నారు. జరుగుతున్నది చూస్తు ఎన్టీయార్ ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: