జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం తాలూకు సిట్ విచారణ నివేదికను తమకు అందించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వచ్చే మంగళవారం నాటికి నివేదిక మొత్తాన్ని సీల్డ్ కవర్లో పెట్టి ఇవ్వాలంటూ హై కోర్టు ఆదేశించటం చూస్తుంటే జగన్ వాదనతో ఏకీభవించినట్లే కనబడుతోంది. ఎందుకంటే, హత్యాయత్నం ఘటనకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం చాలా తప్పులే చేసింది. ఆ తప్పులే ఇపుడు జగన్ కు వరంలాగ మారింది. ఘటనను ఘటనగా చూడకుండా జగన్ పై వ్యక్తిగత ధ్వేషంతో సానుభూతి ఎక్కడ వచ్చేస్తుందో అన్న ఆలోచనతోనే హతయాయత్నం ఘటనను చాలా చులకనగా మాట్లాడారు. అక్కడి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయి.

 

విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం ఘటన జరిగిన గంటలోపే డిజిపి ఠాకూర్ మాట్లాడుతూ, జగన్ పై దాడి చేసింది అభిమానే అన్నారు. సానుభూతి, ప్రచారం కోసమే నిందితుడు దాడి చేసినట్లు తేల్చేశారు. ఇక్కడ ఠాకూర్ మాటల్లో తనపై తానే జగన్ దాడి చేయించుకున్నాడు అనే అర్ధమే వినిపించింది. దాంతో మంత్రులు, చివరకు చంద్రబాబు కూడా అదే పద్దతిలో మాట్లాడారు. జరిగిన ఘటనను వదిలిపెట్టి కోడి కత్తని, డ్రామాలని, పరామ్శలంతా నాటకాలని, అందరూ కలిసి రాష్ట్రంపై దాడి చేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. తర్వాత ఘటనపై విచారణ కోసం సిట్ వేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఇవన్నీ చూసేవాళ్ళకు హత్యాయత్నం ఘటనను చంద్రబాబు కావాలనే చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలిగించాయి. దానికితోడు నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణ తీరు కూడా అనుమానాలను కలిగించాయి. నిందితుడు నోరు మెదపటం లేదని సిట్ విచారణకు నేతృత్వం వహిస్తున్న మహేష్ చంద్ర లడ్డా పదే పదే చెప్పటంతో అనుమానాలు ఎక్కువైపోయాయి. ఈ విషయాలన్నింటినీ హైకోర్టు విచారణలో జగన్ తరపు లాయర్ గట్టిగా వినిపించారు.

 

అదే సమయంలో హత్యాయత్నం ఘటనపై ప్రభుత్వ తరపు లాయర్ వాదన తేలిపోయిందని సమాచారం. అందుకనే సిట్ విచారణ నివేదిక మొత్తాన్ని తమకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. నివేదిక అందిన తర్వాత విచారణ జరిగిన విధానంపై కోర్టు ఓ అభిప్రాయానికి వస్తుంది. అప్పుడు జగన్ కోరుతున్నట్లు స్వతంత్ర సంస్ధతో విచారణ  చేయించాలా ? లేకపోతే సిబిఐతో విచారణ చేయించాల అన్నది తేలుస్తుంది. ఏదేమైనా విచారణ విధానంలో లోపాలే జగన్ వాదనకు బలం చేకూరుస్తున్నట్లు అర్ధమైపోతోంది. సో, మంగళవారం లేకపోతే బుధవారం నాడు జగన్ వాదనలో పసేంటో తేలిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: