అధికారం మరో ఆరు నెలలు మాత్రమే ఉంది. మళ్ళీ వచ్చేందుకు దారులు కనబడడం లేదు. పొత్తుల ఎత్తులు చూస్తే నవ్వులపాలు అవుతున్నాయి. గెలుపునకు దారేదీ ఇదే  తెలుగుదేశం పార్టీని ఇపుడు వేధిస్తున్న ప్రశ్న. ఏపీలో ఉనికిలో లేని మోడీని తిట్టి ఏం బావుకుంటామో అర్ధం కాక తమ్ముళ్ళు తలలు పట్టుకుంటూంటే బాబు జాతీయ కూటమి అంటూ పరుగులు పెడుతున్నారు మరో వైపు సర్వేలు మాత్రం షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నాయి.


మెజారిటీకి చేరువలో :


ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. టీడీపీ సర్వేలు కాదు, తటస్థ సంస్థల సర్వేలు ఈ విషయాన్ని పక్కా క్లారిటీతో చెబుతున్నాయట. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలుపుకు మొత్తం 74 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో యాభైకి తక్కువ కాకుండా వైసీపీ గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక మిగిలిన ఏడు జిల్లాల్లో వైసీపీకి మరో నలభై సీట్లు ఈజీగానే వస్తాయని, మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ ని వైసీపీ దాటి పవర్ లోకి రావడం ష్యూర్ అంటూ సర్వేలు చెప్పడంతో టీడీపీలో కలవరం మొదలైందని అంటున్నారు.


ఆ రెండు జిల్లాల్లోనే :


ఇక టీడీపీ విషయానికి వస్తే గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లోనే బలం బాగా ఉన్నట్లుగా సర్వేలు సూచిస్తున్నాయి. గోదావరి జిల్లాలు ఈసారి ఎటువైపో తెలియక తమ్ముళ్ళు తికమక అవుతున్నారు. అక్కడ జనసేన పాగా వేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఉత్తరాంధ్ర కూడా ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటుందని తెలుస్తోంది. దాంతో ఎక్కడ లేని కంగారు పుట్టుకొచ్చి చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఒకటికి పదిమార్లు ఈ జిల్లాలకు వరస పెట్టి వస్తున్నారు. ఇక తిత్లీ తుపాను విషయంలో కూడా టీడీపీ ఎక్కడ లేని ఆర్భాటం చేయడం వెనక ఓట్ల రాజకీయమే ఉందని అంటున్నారు. 


కాంగ్రెస్ పై అపనమ్మకమే :


కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా  అది వర్కఔట్ కాదని బాబు సహా అంతా లోలోపల అపనమ్మకంతోనే ఉన్నారట. ఆ పార్టీ ఏపీలో నామమాత్రం అయిపోవడంతోపాటు ఉన్న వారు సైతం కరడు గట్టిన పార్టీ అభిమానులే కావడం వల్ల ఓట్ల షేరింగ్ రేపటి పొత్తులపై సరిగా ఉండదని కూడా లెక్కలు వేస్తున్నారు. ఇక మిగిలిన వారు సైతం ఈ పొత్తు ఇష్టపడక రాజీనామాలు చేస్తున్నారు.


ఈ పొత్తు వల్ల  కాస్తో కూస్తో మేలు జరిగితే కాంగ్రెస్ కే తప్ప టీడీపీకి లేనేలేదని కూడా అంటున్నారు. దాంతో వైసీపీని నిలువరించడం ఎలాగో తెలియక టీడీపీ హై కమాండ్ నానా హైరానా పడుతోందట. సర్వేలు ఏ నెలకు ఆ నెల వచ్చినవి మాత్రం టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని స్పష్టంగానే చెబుతున్న వేళ కూటమి రాజకీయాలు, కూట నీతులు టీడీపీని ఎలా గట్టెక్కిస్తాయో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: