జగన్ పాదయాత్రకు మళ్ళీ రెడీ అవుతున్న వేళ వైసీపీలోకి కొత్త  చేరికల ఊపు కనిపిస్తోంది. పార్టీలోకి వచ్చేందుకు అనేకమంది ఆసక్తిగా ఉన్నప్పటికీ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాక ఆగిపోయారు. ఇపుడు జగన్ రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి రావాలనుకుంటున్నారు. దానికి తోడు పార్టీలో వచ్చే వారిని సైతం కండువాలు కప్పాలని కూడా భావిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో  సరి కొత్త  కదలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


సీయార్ అటు వైపే :


మొదట టీడీపీ, ఆ మీదట ప్రజారాజ్యం, కాంగ్రెస్ లలో కీలక పాత్ర పోషించిన కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సీ రామచంద్రయ్య (సీయార్) ఇపుడు వైసీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తును తీవ్రంగా తప్పుపడుతూ బయటకు వచ్చారు. . అదే సమయంలో ఆయన చంద్రబాబుని గట్టిగా వ్యతిరేకించే ఏపీ నేతల్లో ముఖ్యుడుగా ఉంటున్నారు.  ఇక సీయార్ మొదట  జనసేనలోకి ఆయన వెళ్తారని అంతా భావించినా ఎందుకో ఆయన ఫ్యాన్ పార్టీ వైపుగా తిరిగారు. ఈ పరిస్తితుల్లో తనకు సూటైన పార్టీగా ఆయన వైసీపీని ఎంచుకున్నారని తెలుస్తోంది.


ఆ రోజే ముహూర్తం :


జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లా సాలూరులో ఈ నెల 12వ్ మొదలుకాబోతోంది. ఆ మరుసటి రోజు అంటే 13న రామచంద్రయ్య జగన్ ని అక్కడే కలసి పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం. జగన్ జిల్లాకు చెందిన రామచంద్రయ్య రాకను మనస్పూర్తిగా అధినేత ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతున్నారు. రామచంద్రయ్య సేవలను పార్టీ అభివ్రుధ్ధికి బాగా ఉపయోగించుకోవాలని జగన్ యోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.


బలం పెరిగినట్లే :


రామచంద్రయ్యను రాజకీయ మేధావిగా చెప్పుకోవాలి. ఆయన మీడియా మీటింగులు చూసిన సరైన పాయింట్లను  లేవనెత్తి అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో దిట్ట. రేపటి రోజున వైసీపీ నుంచి ఆయన సంధించే బాణాలకు టీడీపీ జవాబు లేక తడుముకోవాల్సిందేనని అంటున్నారు. జగన్ పార్టీకి ఇది కొత్త బలంగానే  చెప్పుకోవాలి. ఇక కడప జిల్లాలో కీలకమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రయ్య రాక జిల్లాలో రాజకీయంగానూ వైసీపీకి ఉపయోగపడుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: