చూడబోతే వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావటం అధినేత పవన్ కల్యాణ్ కోటరికే ఇష్టం లేనట్లుంది. ఎందుకంటే, జనబలమున్న నేతలెవరినీ జనసేనలోకి రాకుండా ఒకవేళ వచ్చినా పట్టుమని నాలుగురోజులు కూడా పనిచేసుకోనీకుండా కోటరీలోని కొందరు అడుగడుగునా అడ్డుపడుతున్నారట. ఇప్పటికే కోటరీలో ఒకరంటే ఒకరికి పడని కారణంగా గ్రూపుల గోలలో నలిగి పార్టీకి దూరమైన వాళ్ళు చాలామందే ఉన్నారు. తాజాగా  ఈమధ్యనే జనసేనలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు గోతులు తవ్వటం మొదలైందట.

 

జనసేనలో కుమ్ములాటలు ఈ స్ధాయిలో పెరిగిపోవటానికి, చాలామంది నేతలు పార్టీకి దూరమవటానికి ప్రధాన కారణంగా  మీడియా హెడ్,  పొలిటికల్ సెక్రెటరీ హరిప్రసాద్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. నిప్పులేందే పొగరాదు కదా ? హరిప్రసాద్ కు ఎవరితోను పడటం లేదట. పవన్ కు  ఈ కన్వీనర్ బాగా సన్నిహితుడనే ప్రచారం ఉండటం వల్ల నేరుగా పవన్ తో ఆయన విషయాలు ప్రస్తావించటానికి మిగిలిన వాళ్ళు వెనకాడుతున్నారు. అయితే హరిప్రసాద్ విషయం ఆనోట ఈనోట పవన్ దృష్టికి చేరిందని సమాచారం. అయితే ఇప్పటికే జనసేన పవన్ కోటరీలో కుమ్ములాటలు తారస్ధాయికి చేరుకున్నాయి. ఆ తలనొప్పులు పడలేకే పవన్ స్వయంగా మనోహర్ ను జనసేనలోకి చేర్చుకున్నారు.

 

తాజాగా పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే మనోహర్ ను కూడా పార్టీలో నుండి బయటకు పంపటానికి కోటరీలో అప్పుడే ప్లాన్లు మొదలయ్యాయట. ఎవరెని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో ముందు పవన్ తేల్చుకోవాలి. పార్టీల అధినేతల చుట్టూ కోటరీ ఉండటం చాలా సహజం. కానీ ఆ కోటరీ వల్ల అధినేత లాభపడాలే కానీ దెబ్బ తినకూడదు. నిజానికి హరిప్రసాద్ పేరుకే మీడియా కన్వీనర్. ఆయనకు ఏ మీడియాతో కూడా సరైన సంబంధాలు లేవనే చెప్పాలి. పవన్ యాత్రలకు  రావాల్సినంత ప్రచారం రావటం లేదన్నది వాస్తవం. అందుకు ప్రధానంగా నిందించాల్సింది హరిప్రసాద్ నే. ఎందుకంటే, ఆయన ఏ మీడియాతోను సక్రమంగా మాట్లాడేది లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే సరిగా మాట్లాడటం లేదనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. తనంతట తానుగా మీడియా మిత్రులను పవన్ దగ్గరకు హరిప్రపాద్ తీసుకెళ్ళింది లేదని జనసేన వర్గాలే చెబుతున్నాయి. అంటే మీడియా కన్వీనర్ గా ఆయన ఎంత బాగా పనిచేస్తున్నారో అర్ధమవుతోంది.

 

అందుకనే ఈమధ్యనే చేరిన మనోహర్ కు మీడియా బాధ్యతలు పవన్ అప్పగించినట్లు సమాచారం. విజయవాడలో ప్రారంభమైన కార్యాలయంలో మనోహర్ ఓ పిఆర్వోతో పాటు పిఏని పెట్టుకుని మీడియా వ్యవహారాలు చూస్తున్నారట. పవన్ మొన్ననే పూర్తి చేసిన విజయవాడ-తుని రైలు యాత్ర విజయవంతమైందంటే మనోహర్ కృషే ప్రధానమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ నుండి కొందరు మీడియా వాళ్ళని పవన్ తో పాటు రైల్లో తీసుకువెళ్ళారు. అంతేకాకుండా విజయవాడలో మొదలైన రైలుయాత్ర తునిలో ముగిసేవరకూ మధ్యలో వచ్చే స్టేషన్లు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరంలో స్ధానిక మీడియాను కూడా ఆహ్వానించి పవన్ తో మాట్లాడించారట. పవన్ తో మీడియా ఇంటరాక్షన్ ఈ స్ధాయిలో మనోహర్ వచ్చిన తర్వాతే జరిగిందట.

 

అసలే జనసేన  కొత్తపార్టీ. పేరుకే జనసేన కానీ ఆ పార్టీకి జనబలమెంతుందో ఇంతవరకూ తెలీదు. ఇప్పటి వరకూ తెలిసిందంతా అభిమానులబలమే. కాబట్టి మీడియా మద్దతు ఎత అవసరమో పవన్ కూడా మొన్నటి వరకూ గ్రహించినట్లు లేదు. అందుకే తాజాగా హరిప్రసాద్ ను పక్కనపెట్టి మీడియా బాధ్యతను మనోహర్ కు అప్పగించారట. మీడియా మద్దతు ఎంత అవసరమో నాలుగేళ్ళ స్నేహం తర్వాత కూడా చంద్రబాబునాయుడును చూసి పవన్ నేర్చుకోలేకపోతే ఎలా ? తన కోటరీలో జనబలమున్న వాళ్ళెవరు ? లేనివాళ్ళెవరు అన్న విషయాన్ని పవన్ తేల్చుకోవాలి. ఎవరినెక్కడ వాడుకోవాలో ? ఎంత వాడుకోవాలో తెలుసుకోకపోతే...

 

2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చే విషయంలో ఒకవైపు పవన్ కృషి చేస్తుంటే మరోవైపు పవన్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరును చేయటానికి కోటరీలో ముఖ్యులు శక్తవంచన లేకుండా కృషి చేస్తున్నారు. అంటే పవన్ పక్కనే ఉంటూ పవన్ పైనే యధశక్తి బండలేస్తున్నారన్నమాట. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేనివాళ్ళను కోటరీలో ఉంచుకుని అందలాలెక్కిస్తే రేపు జరగబోయే డ్యామేజికి పవనే బాధ్యత వహించాలి. తన సోదరుడు చిరంజీవి చేసిన తప్పులను చూసి కూడా పవన్ పాఠాలు నేర్చుకోకపోతే ఎలా ?


మరింత సమాచారం తెలుసుకోండి: