ప్రముఖ బిసి నేత మార్గాని నాగేశ్వరరావు వైసిపిలో చేరారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి చెందిన మార్గాని పారిశ్రామికవేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. రాజమండ్రి పార్లమెంటుకు వచ్చే ఎన్నికల్లో మార్గాని వైసిపి అభ్యర్ధిగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు పాదయాత్ర మళ్ళీ ప్రారంభమైన సందర్భంగా మార్గాని నాగేశ్వరరావు, కొడుకు మార్గాని భరత్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. పార్లమెంటు అభ్యర్ధిగా మార్గాని పేరును పార్లమెంటు పరిధిలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

 

మామూలుగా అయితే అందరూ కలిసి ఒక వ్యక్తి పేరును సిఫారసు చేయటం అరుదనే చెప్పాలి. కానీ ఇక్కడ సిఫారసు చేశారంటే కారణం ఏమిటి ? ఏమిటంటే, మార్గాని ప్రముఖ పారిశ్రామికవేత్త. అందునా ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడు. పైగా రాజమండ్రి పార్లమెంటు సీటును బిసి సామాజికవర్గానికి అందునా గౌడ ఉప కులానికి కేటాయించనున్నట్లు స్వయంగా జగనే ప్రకటించారు. జగన్ ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ సరైన గౌడ నేత ఇంతకాలానికి దొరికారు. అందులోను మార్గానికి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

రాజమండ్రి  పార్లమెంటు పరిధిలోని రాజమండ్రి అర్బన్, రూరల్, రాజానాగరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి నియోజకవర్గాల్లో బిసిలెక్కువ. అందులోను గౌడలదే డామినేషన్. ఆ విషయం చూసుకున్న తర్వాతే జగన్ గౌడలకు పార్లమెంటు టిక్కెట్టు హామీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ సమన్వకర్తల సమావేశంలో నేతలందరూ మార్గాని పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించటంతో జగన్ కు కూడా అభ్యంతరాలేమీ కనబడలేదట. దాంతో వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు టిక్కెట్టు మార్గానికే దక్కే అవకాశం దాదాపు ఖరారనే చెప్పుకోవాలి.


తండ్రితో పాటు వైసిపిలో చేరిన భరత్ మొన్నటి వరకూ టిడిపిలో బాగా యాక్టివ్ గా తిరిగారు. రాజమండ్రి రూరల్ టిక్కెట్టును భరత్ కే కేటాయించనున్నట్లు నారా లోకేష్ హామీ కూడా ఇచ్చారట. అంటే లోకేష్, భరత్ మధ్య బాగా సన్నిహిత సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది భరత్ టిడిపిని వదిలేయటం తెలుగుదేశంపార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: