రాజకీయాలు కూడా ఓ విధంగా లెక్కల్లాంటివే. అయితే మామూలు లెక్కలు ఇక్కడ సరిపోవు. రెండు రెండు నాలుగు అవచ్చు, ఆరు కూడా కావచ్చు. అదే రాజకీయ గణితం. సున్నా అనుకుని వదిలేస్తే అదే కొంప ముంచడమూ పాలిటిక్స్ లెక్కల్లో కనిపిస్తుంది. పెద్ద నంబరే కదా బెంగ ఎందుకు అని ధీమాగా ఉంటే అది కూడా కలవరపెడుతుంది. మొత్తానికి రాజకీయ గణాంకాలు ఎంతటి తలలు పండిన వారికైనా ఓ పట్టాన అర్ధం కావు.


పవన్ గ్రాఫ్ అలా :


ఏపీ రాజకీయాల్లో పవన్ గ్రాఫ్ అలా పెరిగిపోతోంది. మొన్నటి వరకూ చీల్చే పార్టీగా లెక్కలు వేసిన వారంతా ఇపుడు కూల్చే పార్టీగా భావించాల్సివస్తోందంటే జనసేన రాజకీయం ఎంత దూకుడుగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. మరి చీల్చడం, కూల్చడం ఏ పార్టీ మీద. పవన్ వల్ల ఎవరికి నష్టం అన్న దానిపై విశ్లేషణ చేస్తే రెండు ప్రధాన పార్టీలకు ఆయన బాగానే దెబ్బేస్తాడని సర్వేల్లో తేలుతోంది. కాసింత ఎక్కువగా చంద్రబాబు పార్టీకి దెబ్బ పడుతుందని కూడా అంటున్నారు.


సర్వేలు బేజారెత్తిస్తున్నాయి :


పవన్  పార్టీ బలంపై వచ్చిన లేటెస్ట్ సర్వేలు బేజారెత్తించేలా ఉన్నాయి. ఆయన ఓట్ల శాతం ఒక్కసారిగా ఏడు శాతానికి పెరిగిందట. మరి ఇదేమీ తక్కువ ఓట్లు కావు. ఓ రాజకీయ పార్టీ పుట్టె ముంచడానికి ఓట్లు బాగానే సరిపోతాయి. ఇంకా అసలైన ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంది. అప్పటికీ ఈ ఏడు శాతం రెట్టింపు కూడా కావచ్చు అదే జరిగితే కొంప కూల్చే పార్టీ జనసేన అవడం ఖాయమంటున్నారు.


టీడీపీకేనా :


పవన్ పార్టీకి పెరిగిన ఈ గ్రాఫ్ టీడీపీకి దెబ్బ పడేలా ఉందని అంటున్నారు. ఎందుచేతనంటే గత ఎన్నికల్లో పవన్ మద్దతు వల్ల చంద్రబాబు గోదావరి జిల్లాలో బాగా సీట్లు గెలుచుకున్నారు. మొత్తానికి మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అయనకు సీట్లు వచ్చాయంటే దానికి పవన్ కారణమన్న వాదన ఉంది. ఇపుడు పవన్ వేరు పడ్డాక టీడీపీకి ఆ ఓట్లు రావన్న భావన కూడా ఉంది. పైగా పవన్ చూపు అంతా గోదావరి జిల్లాల మీదనే ఉంది. 


ఇక్కడ పోయిన ఎన్నికల్లో వైసీపీకి పెద్దగా వచ్చిందీ లేదు, ఇపుడు పోయింది కూడా లేదు. దాంతో కలవరం అంతా టీడీపీదే అవుతోంది. పవన్ టీడీపీని చీల్చి చెండాడుతున్నారు. ఏకంగా చంద్రబాబు లోకేష్ లను గురి పెట్టి మరీ బాణాలు సంధిస్తున్నారు. దానికి తోడు ఆయనకు ఉన్న సినిమా గ్లామర్, బలమైన సామాజిక వర్గం వెరశి టీడీపీకి కంగారు మొదలవుతోంది. గోదావరి జిల్లాలో ఓట్లూ సీట్లూ దక్కకపోతే అధికారం చేజారడం ఖాయం. ఇదే సెంటిమెంట్ తో ఇపుడు టీడీపీ బెంగటిల్లుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: