ప్రముఖ సినీ నటుడు, ఏపీలోని హిందూపూరం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పంతం నెగ్గించుకున్నారు. ఇప్పటి వరకు సినిమా రంగంలో పెద్ద హీరోగా ఉన్నా బాలయ్య తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెద్దగా ఇన్‌వాల్వ్ ఖారన్న పేరుంది. తన సినిమాలు, తాను ప్రాధినిత్యం వహిస్తున్న హిందూపూర్‌ నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రమే తన ముద్ర ఉండేలా చూసుకునే బాలయ్య తెలుగుదేశం పార్టీలో ఇతర‌త్రా రాజకీయ కార్యక్రమాలు, ఇతరుల వ్యవహారాల్లో ఏ నాడు వేలు పెట్టలేదు. అయితే తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల విషయంలో మాత్రం ఓ కీలక నియోజకవర్గం నుంచి తన అనుచరుడికి సీటు ఇప్పించుకునే విషయంలో ఆయన బాబుతో సైతం పంతం వేసి తన మాటే నెగ్గించుకున్నారు.
 
గ్రేటర్‌ హైదరాబాద్‌కు గుండెకాయలాంటి నియోజకవర్గం శేరిలింగంపల్లి. తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ మంచి పట్టే ఉంది. తెలుగుదేశం పార్టీని బాగా అభిమానించే సామాజికవర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ కేడర్ ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న  ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ 70వేల పై చిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత ఆపరేషన్‌ ఆకర్ష్‌ నేపథ్యంలో ఆయన కారెక్కేశారు. తాజా ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి ఆయనే మరో సారి పోటీకి రెడీ అవుతున్నారు. తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో శేరిలింగంపల్లి సీటును పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ టీడీపీకి కేటాయించింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ తరపున పలువురు పోటీ పడ్డారు. 


తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా తక్కువ నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి ఉండడంతో ఇక్కడ నుంచి గతంలో టీడీపీ టిక్కెట్‌ కోసం విఫల ప్రయత్నం చేసిన మొవ్వా సత్యనారాయణతో పాటు, ప్రముఖ పారిశ్రామిక వేత్త భ‌వ్య ఆనంద్‌ప్రసాద్‌ సైతం తాజాగా తెర మీదకు వచ్చారు. వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో కేడర్‌ పరంగా, క్షేత్ర స్థాయిలోనూ మువ్వా సత్యనారాయణకే మంచి పట్టుంది. అయితే ఆయన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల టైమ్‌లో టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసి ఆ తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చారు. దీంతో ఇప్పుడు శేరిలింగంపల్లి సీటు కోసం మువ్వా సత్యనారాయణతో పాటు భవ్య ఆనంద్‌ప్రసాద్‌ హోరా హోరీగా తలపడ్డారు. ఈ ఇరువర్గాలు రోడ్లు ఎక్కి ఫైటింగ్‌ చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఫైన‌ల్‌గా సీటును భవ్య ఆనంద్‌ప్రసాద్‌కే కేటాయించారు. 


భవ్య ఆనంద్‌ప్రసాద్‌ టీడీపీ వాది కాదు. ఆయన పార్టీ కోసం జెండా మోసిందిలేదు. కేవలం బాలయ్యతో ఆయనకు ఉన్న పరిచయంతో పాటు ఆయనతో   'ఫైసా వసూల్‌' లాంటి ఫ్లాప్‌ సినిమా కూడా తీశారు. ఆ పరిచయమే ఇప్పుడు ఆయనకు టిక్కెట్‌ ఇప్పించిందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా జెండాను మోసినవాళ్లను కాదని ఇప్పుడు భవ్య ఆనంద్‌ప్రసాద్‌ సీటు తన్నుకుపోవడం వెనక చంద్రబాబుపై బాలయ్య ఒత్తిడి పని చేసినట్టు తెలుసింది. వాస్తవంగా చంద్రబాబు ముందు మొవ్వా వైపు మొగ్గు చూపినా చివరకు బాలయ్య ఒత్తిడితో ఆనంద్‌ప్రసాద్‌కు సీటు ఖ‌రారు చెయ్యక తప్పలేదని తెలుస్తోంది. ఏదేమైనా ఏళ్లకు ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్లను కాదని ఎన్నికల టైమ్‌లో పార్టీలోకి వచ్చి హడావుడి చేసి సీటు కొట్టేసిన భవ్య ఆనందప్రసాద్‌ లక్కీ పర్సనే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: