ఏపీలో రాజకీయం మామూలుగా హీటెక్కడం లేదు. ఇప్పటికే అధికార టీడీపీ వర్సెస్‌ విపక్ష వైసీపీ, జనసేన మధ్య‌ మాటల యుద్ధం మామూలుగా లేదు. అధికార టీడీపీ ఇటు జగన్‌, పవన్‌ల‌ను ఓ రేంజులో టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తుంటే జనసేన, వైసీపీ సైతం చంద్రబాబును, టీడీపీని ఆ పార్టీ నాయకులను టార్గెట్‌గా చేసుకుని తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు టైమ్‌ ఉన్నా అప్పుడే ఇక్కడ మాటల యుద్ధంతో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలో తాము ఉన్న పార్టీలో సీట్లు రాని వాళ్లు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేసేస్తున్నారు. ఇప్పటికే కొందరు పార్టీలు మారి సీట్లు దక్కించుకోవడంలో సక్సెస్‌ అవ్వగా మరి కొందరు నామినేషన్ల టైమ్‌ దగ్గర పడుతున్న టైమ్‌లో పార్టీ కండువాలు మార్చి వేరే పార్టీలో సీటు వస్తుందా ? అన్న ప్రయత్నాల్లోనూ మునిగిపోయారు. 


తెలంగాణలో ఎన్నికల వేళ‌ ఈ పరిస్థితి ఉంటే ఏపీలో ఎన్నికలకు ఐదు నెలలు ముందుగానే కప్పుల తక్కెడకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఏపీలో అధికార పార్టీలోకి ఓ సీనియర్‌ రాజకీయ నేత వచ్చేందుకు తెర వెనక ఇప్పటికే రంగం సిద్ధం అవ్వగా... అదే టైమ్‌లో మరో సీనియర్‌ రాజకీయ నేత ఆ పార్టీకి షాక్‌ ఇచ్చి వైసీపీలోకి జంప్‌ చేసేందుకు తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఇంతకు ఆ ఇద్దరు సీనియర్లు ఎవరో కాదు బీజేపీ నుంచి గత ఎన్నికల్లో కైకలూరులో ఎమ్మెల్యేగా గెలిచి బాబు క్యాబినెట్‌లో  మూడున్నర ఏళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన కామినేని శ్రీనివాస్ ఒక‌రు. ఆయ‌న బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. స్వత‌హాగా టీడీపీ వాది అయిన కామినేని గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అనూహ్యంగా మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. 


ఇప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య‌ పొత్తు విచ్ఛిన్నం అవ్వడంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ తరపున పోటీ చేసే వాళ్లు గెలిచే పరిస్థితి కాదు కదా డిపాజిట్‌ దక్కించుకున్నా గొప్పే అన్నట్టుగా ఉంది. ఏపీ జనాలు బీజేపీపై తీవ్రమైన వ్యతిరేఖత చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు కనపడడం లేదు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికలకు ముందుగానే టీడీపీలోకి వచ్చేందుకు మార్గం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా కామినేని ముఖ్య మంత్రిని కలుసుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యపై ఆయన చంద్రబాబును కలిసినట్టు చెబుతున్నా ఆయన మాత్రం ఎన్నికలకు ముందు పార్టీ మారి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కైకలూరు నుంచే టీడీపీ తరపున పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. 


వాస్తవంగా చెప్పాలంటే ఆయన బీజేపీ మంత్రిగా ఉన్నప్పుటి నుంచే ఈ ప్రచారం ఉంది. ఇక కామినేని ఆరు నెలలగా బీజేపీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో ఏర్పడిన గ్యాప్‌ నేపథ్యంలో ఎన్డీయే నుంచి నుంచి టీడీపీ బయటకు రావడం ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైతొలగడంతో అప్పటి నుంచి కామినేని పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం అయ్యిపోయారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీలో ఇమడలేకపోతున్నారన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జిల్లాల్లో గత ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్‌లో చక్రం తిప్పడంతో పాటు 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్‌ చేసి ఆ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి 12 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 


ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక గత ఏడాది జరిగిన క్యాబినెట్‌ ప్రక్షాళ‌న‌లో సైతం  శ్రీనివాసుల రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. క్యాబినెట్‌ ప్రక్షాళ‌న‌కు ముందు శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు నుంచి పిలుపు సైతం వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ తర్వాత చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టారు. ఇక నాలుగున్నర ఏళ్లుగా జిల్లా టీడీపీ నాయకులు ఆయన్ను పూచిక‌ పుల్లలాగా తీసి పక్కన పెట్టేయ్యడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న వైవీ. సుబ్బారెడ్డిని వచ్చే ఎన్నికల్లో జగన్‌ పక్కన పెడతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాసుల రెడ్డి ఇప్పటికిప్పుడు పార్టీ మారినా ఆయనకు ఒంగోలు వైసీపీ సీటు రెడీగా ఉంది. ఏదేమైనా ఎన్నికలకు ముందు ఏపీలో జరుగుతున్న ఈ రెండు రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగానే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: