చంద్రబాబు రాజకీయ గండర గండడు. ఆయనకు నచ్చినది పదే పదే చెబుతారు. అదే జనాలను వినమంటారు. అనుకూల మీడియా బ్రుందగానం కూడా అలాగే వినిపిస్తుందనుకోండి. నచ్చనిది మాత్రం పూర్తిగా జనం మనసుల్లోంచి చెరిపేయాలనుకుంటారు. అందుకోసం పెద్ద గీతలు ఎన్నైనా గీసేస్తారు. కానీ ఒక్కోసారి చిన్న గీత దగ్గరే  జనం ఆగిపోతారు. పరిస్థితులు కూడా కలసి రావు... అపుడేం జరుగుతుంది...


ఉక్రోషం పట్టలేని బాబు:


ఈ రోజు హై కోర్టు జగన్ పై హత్యాయత్నం కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఇది నిజంగా సంచలన పరిణామమే. బాబుకు నోటీసులంటే మాటలా. ఈ మధ్యనే బాబ్లీ కేసులో మహరాస్ట్ర లోని ధర్మాబాద్ కూడా ఇలాంటి నోటీసులే పంపింది. అప్పట్లో బాబు ఎంత హంగామా చేసారో గుర్తుండే ఉంటుంది. నిజానికి నోటీసులు రావడం రాజకీయ నాయకులకు అత్యంత సహజం. కానీ చంద్రబాబు తాను కోర్టులకు, అన్ని వ్యవస్థలకు అతీతున్ని అని ఫీల్ అవుతారు. ఆయనే కాదు, ఆయన పార్టీ తమ్ముళ్ళు, ఆఖరుకి కాపు కాసే  మీడియా సైతం బాబుకు నోటీసులు రావడాన్ని అసలు సహించవు. అందుకే ఇపుడు బాబు ఏదో పరాభవం జరిగినట్లుగా ఉక్రోషం వెళ్ళగక్కుతున్నారు.


చెడా మడా తిట్టేశారుగా :


ఇక ఈ రోజు విజయవాడలో ఆశా వర్కర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగులో బాబు రాజకీయ విమర్శలు  చేశారు. నోటీసుల వేడి అంతా అక్కడ దించుకున్నారు. మోడీ, జగన్ ఒక్కటయ్యారని, అభివ్రుధ్ధిని అడ్డుకుంటున్నారని తిట్ల పురాణం లంకించుకున్నారు. కోడి కత్తి డ్రామా, అది  ఓ దుర్మార్గం అంటూ ఆవేశపడిపోయారు. అభివ్రుధ్ధిని అంతా కలసి అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. మోడీని ఎందుకు తిట్టరని కూడా జగన్, పవన్ లను నిలదీశారు.


ఓటమేనా :


నిజానికి జగన్ పై హత్యాయత్నం కేసులో తెలుగుదేశం చాలా తప్పులు చేసింది. ఇదంతా ఇగోల వల్ల వచ్చిన తంటా. జగన్ ని ప్రతిపక్ష నాయకునిగా గుర్తించడానికే బాబు ఇష్టపడరు. అలాంటిది పరామర్శిస్తారనుకోవడం పొరపాటు. అది వదిలేసినా హేళన చేయదం మొదలెట్టారు. అభిమానితో జగనే కత్తి తెచ్చి పొడిపించుకున్నారని ప్రచారం చేశారు. అలా ఆ ఘటనను  జనంలో తేలిక చేయాలని చూశారు.


 దీని కంటే పెద్ద గీత గీస్తూ ఉన్నఫళంగా ప్రజాస్వామ్యం, పరిరక్షణ  అంటూ డిల్లీకి వెళ్ళి కూటముల కధలు వల్లించారు. ఎంత చేసినా జగన్ పై హత్యా యత్నం కేసు కధ వేడి అలాగే  ఉంది. అదే ఈ రోజు నోటీసుల రూపంలో బాబు అండ్ కో లో కొత్త వేడిని తెప్పించింది. నోటీసులు రావడమే  ఓటమిగా బాబు బ్రుంధం ఇపుడు తెగ ఫీల్ అవుతోంది. నిజానికి సీపీఐ నారాయణ సైతం జగన్ పై హత్యాయత్నం ఘటనలో బాబు, డీజీపీ స్పందన ఏ మాత్రం బాగులేదని అన్నారు కూడా. మిగిలిన పక్షాలదీ ఈ విషయంలో అదే మాట.
.
జనం నమ్ముతారని కంగారు :


నిన్నటి వరకూ జగన్ కేసును చిన్నగా చూపిన బాబు అండ్ కో తో పాటు, మీడియా బ్రుందం ఇపుడు కోర్టు  నోటీసుల తరువాత జనం వేలు ఇటు వైపు చూపిస్తారని హడలిపోతున్నారు. నిజానికి ఈ కేసు సీరియస్ అయినదే కానీ, దాన్ని ఇంకా పెద్దది చేసింది మాత్రం కచ్చితంగా టీడీపీనే. ఇదిలా ఉంటే ఈ రోజు వైసీపీ నేతలు రాష్ట్రపతిని కూడా కలసి రావడం టీడీపీకిపుండు మీద కారం చల్లినట్లే మరి. మొత్తానికి బాబుకు కోర్టు  నోటీసులు తీసుకురావడం వరకూ వైసీపీ విజయం సాధించినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: