జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం పొగను వైసిపి తెలివిగా  రాజేసింది. హత్యాయత్నం కారణంగా మధ్యలో నిలిపేసిన పాదయాత్రను జగన్ మళ్ళీ సోమవారం నుండి ప్రారంభించారు. అయితే, వ్యూహాత్మకంగా తన తల్లితో జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనను మాట్లాడించటం ద్వారా జగన్ మంటను రాజేశారు.  పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో జగన్ పై ఎయిర్ పోర్టు క్యాంటిన్ లోనే పనిచేసే శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.


గొంతులో కత్తిని దింపే లక్ష్యంతో దాడి చేసినా అదృష్టం వల్ల కత్తిపోటు గొంతులో కాకుండా ఎడమభుజం క్రింద దిగింది. సరే తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జగన్ పై జరిగింది హత్యాయత్నం కుట్రే అంటూ వైసిపి నేతలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. కాదు తనపై తానే దాడి చేయించుకున్నాడు అంటూ జగన్ పై చంద్రబాబునాయుడు ఎదురుదాడి చేయటం అందరూ చూసిందే. నిజానికి చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఎదురుదాడికి ఆధారాలు లేకపోయినా మీడియా మద్దతుతోనే హత్యాయత్నం ఘటనకు పెద్దగా ప్రచారం రాకుండా అడ్డుకోగలిగారు.


అదే చంద్రబాబో లేకపోతే లోకేష్ కానీ అదీ లేకపోతే ఏ మంత్రో, కీలక నేతపైనో గనుక దాడి జరిగుంటే రాష్ట్రం అల్లకల్లోలమైపోయుండేదనటంలో సందేహం లేదు. దాడి ఘటనను జాతీయ స్ధాయిలో రచ్చ రచ్చ చేసుండేవారు.  ప్రధాన ప్రతిపక్ష నేతపైన హత్యాయత్నం జరిగితే తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నిలిచే మీడియాకు అది వార్తగా కనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు నంది అంటే నంది కాదు పంది అంటే పంది సదరు మీడియాకు. హత్యాయత్నం ఘటనపై సాక్షి ఎంత గొంతు చించుకున్నా అది జగన్ మీడియా కాబట్టి జనాలు కూడా పెద్దగా స్పందించలేదు.


ఈ పరిస్ధితుల్లో జగన్ కు అండగా నిలిచింది సోషల్ మీడియా మాత్రమే. ఇటువంటి పరిస్ధితుల్లో సోమవారం ప్రారంభమైన పాదయాత్రకు ముందురోజు విజయమ్మ హత్యాయత్నం ఘటనను మళ్ళీ కెలికారు.  హత్యాయత్నం ఘటన జరిగిన తర్వాత జగన్ ఫ్యామిలీలో ఎవరూ మీడియా ముందుకు రాలేదు. పాదయాత్ర ముందురోజు విజయమ్మతో మాట్లాడించటం కూడా వ్యూహాత్మకమే అనుకోవాలి. దాదాపు అర్ధగంట పాటు మాట్లాడిన విజయమ్మ చంద్రబాబునే నేరుగా టార్గెట్ చేశారు. కాస్త సెంటిమెంటును,  జగన్ ప్రాణాలపై ఆందోళనను, చంద్రబాబుకు హెచ్చరికలను, రక్షణ పై జగన్ అభిమానులకు విజ్ఞప్తిని ఇలా అనేక రకాలుగా విజయమ్మ స్పీచ్ లో రంగరించారు.


ఎప్పుడైతే విజయమ్మ పేరెత్తకుండానే చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారో దానికి కౌంటర్ గా మళ్ళీ మంత్రులు, టిడిపి నేతలు హత్యాయత్నం ఘటనపై ఎదురుదాడి మొదలుపెట్టారు. జగన్ కు కావాల్సింది కూడా అదే. విజయమ్మ మాట్లాడటంతో సెంటిమెంటు బాగానే పండింది. దానికితోడు సాలూరులో మళ్ళీ మొదలైన పాదయాత్రకు జనాలు విపరీతంగా రావటం కూడా ప్రభుత్వానికి బాగాా మండించింది. మొత్తానికి తనపై జరిగిన హత్యాయత్నం ఘటన మరుగునపడకుండా వ్యూహాత్మకంగా జగన్ బాగనే రాజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: