క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతోంది. ఎందుకంటే, గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాల్లో  అభ్యర్ధుల  ప్రకటనను హై కమాండ్ పెండింగ్ లో పెట్టటమే అనుమానాలకు ఊతమిస్తోంది. పోటీలేని నియోజకవర్గాల్లో కూడా ప్రకటన ఎందుకు వాయిదా పడిందో అర్ధంకాక సీనియర్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. విషయాన్ని ఆరాతీస్తే కాంగ్రెస్ సీనియర్లు పోటీకి రెడీ అయిన కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబునాయుడు టిడిపి తరపున కొందరు అభ్యర్ధులను ప్రతిపాదించినట్లు సమాచారం.

 

జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చివరకు పలువురు సీనియర్ల సీట్లకే ఎసరొచ్చేట్లు అనుమానం పెరుగుతోంది.  దాంతో కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. ముందుగా చంద్రబాబు గ్రేటర్ పరిధిలోని సనత్ నగర్, జూబ్లిహిల్స్ నియోజకవర్గాలపై గురిపెట్టారు. సనత్ నగర్ లో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఎప్పటి నుండో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో మరో నేత ఎవరూ పోటీలో లేరు. దాంతో ఈ సీటులో మర్రి పోటీ ఖాయమైపోయింది. అందుకనే ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కానీ విచిత్రంగా మొన్న ఫైనల్ చేసిన మొదటిజాబితాలో శశిధర్ పేరు లేదు.

 

కారణమేమిటంటే, ఇదే నియోజకవర్గం నుండి తానే పోటీలో ఉంటానని చెబుతూ కూన వెంకటేశ్ గౌడ్ ప్రచారం చేసుకుంటున్నారు. కూన టిడిపి నేత. కాంగ్రెస్ నేత పోటీ చేసే నియోజకవర్గంలో టిడిపి నేత ఎలా ప్రచారం చేసుకుంటున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అదేమంటే తనను ప్రచారం చేసుకోమని చంద్రబాబే చెప్పారంటున్నారు కూన. అదేవిధంగా, జూబ్లిహిల్స్ నియోజవర్గంలో మాజీ ఎంఎల్ఏ విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుండి దివంగత నేత పిజెఆర్ పోటీ చేస్తున్నారు. వారసునిగా విష్ణు కంటిన్యు అవుతున్నారు. కానీ మొన్నటి జాబితాలో విష్ణు పేరు కూడా పెండింగ్ లో పెట్టారు.

 

ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాధ్ పోటీ చేస్తున్నారు. చంద్రబాబుకు మాగంటి అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఈ నియోజకవర్గం నుండి విష్ణు కాకుండా మాగంటి సామాజికవర్గంకు చెందిన మరో నేతను చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారట చంద్రబాబు. అందుకనే విష్ణు పేరు పెండింగ్ లో పడింది. ఎల్బీ నగర్, పటాన్ చెరువు నియోజకవర్గాలదీ ఇదే పరిస్ధితి. దాదాపు రెండు నెలలుగా ఎల్బీ నగర్ అభ్యర్ధిగా సుధీర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మొదటి జాబితాలో తన పేరు లేకపోవటంతో సుధీర్ కంగుతిన్నారు.  టిడిపి నేత రంగారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుని టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

 

ఇక, పటాన్ చెరువు నుండి పోటీ చేయటానికి కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుంటే అదే సీటును టిడిపికి కేటాయించాలని చంద్రబాబు పట్టుపడుతున్నారట. అంటే దీనిబట్టి అర్ధమవుతున్నదేమిటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ టిక్కెట్లు కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నారని. 2014 ఎన్నికల్లో కూడా టిడిపిలోని తన మద్దతుదారుడు కామినేని శ్రీనివాస్ ను బిజెపిలోకి పంపి అక్కడ టిక్కెట్టు ఇప్పించుకున్న ఘనుడు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు అర్ధమవుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో చంద్రబాబు జోక్యం ఎక్కడిదాకా వెళుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: