టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ ఈరోజు మధ్యాహ్నం నామినేషన్  దాఖలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఆర్డిఓ కార్యాలయంలో మధ్యాహ్నం 2.34 గంటలకు తన నామినేషన్ వేశారు. అంతకుముందు నంగునూరు మండలంలోని కోనాయిపల్లి దేవాలయంలో వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు. ప్రతీ ఎన్నికకు ముందు కెసియార్ ఇదే ఆలయంలో ప్రత్యేక పూజలు వేయటం ఆనవాయితీగా వస్తోంది. నామినేషన్ కు ముందు ఇక్కడ పూజలు చేయందే కెసియార్ తన నామినేషన్ వేసిన దాఖలాల్లేవు. కెసియార్ వెంట మంత్రి హరీష్ రావు తో పాటు మరికొందరు నేతలు మాత్రమే వచ్చారు.

 

కెసియార్ కు మొదటి నుండి ముహూర్తాలు, శకునాలు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేసింది కూడా ముహూర్తం చూసుకునే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాల నుండి కెసియార్ చాలా ఆరోపణలు, విమర్శలనే ఎదుర్కోవాల్సొచ్చింది. మూఢనమ్మకాలతో రాష్ట్రాన్ని పరిపాలించటమేంటని ప్రతిపక్షాలు దాదాపు ప్రతీ సందర్భంలోను నిలదీస్తున్నాయి. అయినా కెసియార్ ఎవరినీ లెక్కచేయలేదు. తన ఆలోచనల ప్రకారమే ఈరోజు కూడా కోనాయిపల్లి దేవాలయంలో వెంకన్నకు ప్రత్యేకపూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి పాదల దగ్గర నామినేషన్ పత్రాలనుంచి పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేయటానికి వెళ్ళటం గమనార్హం.

 

నామినేషన్ తర్వాత కెసియార్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రైతులకు అప్పులు లేని తెలంగాణా వస్తేనే బంగారు తెలంగాణా వచ్చినట్లు చెప్పారు. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం దేశం మొత్తం మీద ఒక్క తెలంగాణా మాత్రమే అన్నారు. రైతుల ఆదాయాలు పెరగాలని, దేశం మొత్తం మీద ధనిక రైతులకు తెలంగాణా వేదికగా మారాలని కెసియార్ చెప్పటం విచిత్రంగా ఉంది. రైతుల గురించి ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే తెలంగాణాలో అత్యధికంగా ఓట్లున్న సెక్టార్ వ్యవసాయ రంగం మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళతో కోయినాపల్లి దేవుడి పాదాలు కడుగుతానని శపథం చేయటం గమనార్హం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: