వచ్చే ఎన్నికల్లో కెసియార్ టార్గెట్ గా పెట్టుకున్న నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ అన్నింటికన్నా ముందున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ నే కెసియార్ ఎందుకు టార్గెట్ గా పెట్టుకున్నారంటే అది టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి. మొత్తం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓడించాల్సిన నియోజకవర్గాల జాబితాను ఇఫ్పటికే రెడీ చేసుకున్నారు. తాను ఓడించాల్సిన కాంగ్రెస్ నేతల జాబితాలో కనీసం 20 మంది దాకా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులో ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్, షబ్బీర్ ఆలీ, వేం నరేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, గండ్ర వెంకటరామణారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులున్నారు. అయితే, ఇందులో మర్రి టిక్కెట్టు ఇంకా ఖరారు కాలేదనుకోండి అది వేరే సంగతి.


వీరందరిలో మళ్ళీ ఉత్తమ్, రేవంత్ పైన కెసియార్ ప్రత్యేక దృష్టి పెట్టారని టియార్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, టిపిసిసి అధ్యక్షుని హోదాలో కెసియార్ ను ఉత్తమ్  ధీటుగానే ఎదుర్కొంటున్నారు. ఉత్తమ్ పిసిసి అధ్యక్షుడైన దగ్గర నుండి పార్టీలో కాస్త జోరు పెరిగింది. పార్టీలోని వివిధ వర్గాలను కలుపుకుని వెళుతున్నారు. వివాదరహితుడు కాబట్టి మిగిలిన నేతలు కూడా ఉత్తమ్ మాటను దాదాపుగా వింటున్నారనే చెప్పాలి. ఇక్కడ నుండి టిఆర్ఎస్ తరపున ఎవరిని పోటీలోకి దింపాలని కెసియార్ నిర్ణయించుకోలేకపోతున్నారు.

 

అదే సమయంలో పోయిన రెండు ఎన్నికల్లో గెలిచి మంచి ఊపుమీదున్న ఉత్తమ్ హ్యాట్రిక్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మహాకూటమి గెలిస్తే ఉత్తమే ముఖ్యమంత్రన్న ప్రచారం అందరికీ తెలిసిందే. అందులోను టిఆర్ఎస్ ను ఓడించగలిగితే ఉత్తమ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోవటం ఖాయం. అందుకే దాదాపు రెండు నెలలుగా నియోజకవర్గంలో ప్రచారాన్ని బాగా ఉదృతం చేశారు. నియోజకవర్గంలో పార్టీలోని నేతలందరినీ కలుపుకుని పోతున్నారు. టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీల నేతలు ఉత్తమ్ కు బోనస్ గా యాడ్ అయ్యారు.

 

మొత్తానికి ఉత్తమ్ ధీటుగా ఎవరిని పోటీలోకి దింపాలనే విషయంలో కెసియార్ ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోవటమే విచిత్రంగా ఉంది. అధికారికంగా ప్రకటన కాకపోయినా శానంపూడి సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు. సైదిరెడ్డి గడచిన పదేళ్ళుగా విదేశాల్లోనే ఉన్నారు. కెనడ, జమైకాల్లో వ్యపారాలు చేసుకుంటున్న సైదిరెడ్డి ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడుగా ప్రచారంలో ఉన్నారు. సైదిరెడ్డిది కూడా ఉత్తమ్ సామాజికవర్గం కావటమే కాకుండా బలమైన బంధువర్గం కూడా ఉందట.

 

అయితే ఇక్కడే సైదిరెడ్డికి  ఓ సమస్య ఎదురవుతోంది. పోయిన ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీచేసిన శంకరమ్మ టిఆర్ఎస్ టిక్కెట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ శంకరమ్మ ఎవరంటే, తెలంగాణా కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి. పోయిన ఎన్నికల్లో ఉత్తమ్ పై పోటీ చేసి 23 వేల తేడాతో ఓడిపోయారు. కాబట్టి ఇఫుడు మళ్ళీ తనకే టిక్కెట్టు కావాలని పట్టుబడుతున్నారు. కుదరకపోతే బహుశా ఇండిపెండెట్ గా పోటీ చేసే యోచనలో ఉన్నారు. అదే జరిగితే సైదిరెడ్డికి కొంచెం ఇబ్బందే అని చెప్పాలి. సైదిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి మద్దతుందని చెబుతున్నారు. మరి అంతా కలిసి ఉత్తమ్ ను ఓడిస్తారో లేకపోతే ఉత్తమ్ చేతిలో ఓడిపోతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: