ఎన్నికల బిజీలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్ధులకు నెత్తిన పిడుగు పడినట్లైంది. ఎన్నికల బిజిలో ఉండగా తమను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు రెక్కీ నిర్వహిస్తున్నారని తెలియటంతో అభ్యర్ధులు వణికిపోతున్నారు. మావోయిస్టుల టార్గెట్ లో ఎవరెవరున్నారన్న విషయంలో స్పష్టత లేకపోయినా  అధికార టిఆర్ఎస్ అభ్యర్ధులపైనే మావోయిస్టులు గురిపెడతారన్న విషయంలో అనుమానం అవసరం లేదు. మావోయిస్టుల కదలికలు ప్రధానంగా వరంగల్, మహూబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

ప్రభుత్వం మొత్తం ఎన్నికల బిజిలో ఉండటం, మంత్రులు, తాజా మాజీ ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో ఉండటం మావోయిస్టులు అవకాశంగా భావించారు. దాంతో పై జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో బాగా రెక్కీ నిర్వహిస్తున్నారట. అటవీ ప్రాంతాల్లోనే మావోయిస్టులు ఎందుకు ఎక్కువగా ఉన్నారంటే, చాలా నియోజకవర్గాలు అటవీ ప్రాంతాల్లో కలిపే ఉన్నాయి కాబట్టి. ప్రచారంలో భాగంగా చాలామంది అభ్యర్ధులు నియోజకవర్గాల పర్యటనల్లో భాగంగా అటవీ ప్రాంతాల నుండే ప్రయాణం చేయాల్సుంటుంది. అందుకే అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా రెక్కీ నిర్వహిస్తున్నారట.

 

విశాఖపట్నం జిల్లాలోని అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును ఈమధ్యే మావోయిస్టులు కాల్చి చంపిన విషయం గుర్తుండే ఉంటుంది.  అధికారిక పర్యటనల్లో భాగంగా కిడారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నపుడే మావోయిస్టులు మట్టుపెట్టారు. అరకు నియోజకర్గం కూడా అటవీ ప్రాంతమే అన్న విషయం తెలిసిందే. ఇఫుడు కూడా తెలంగాణాలోని చాలా నియోజకవర్గాలు అటవీ ప్రాంతాల్లో కలిసి ఉండటం మావోయిస్టులకు కలిసివస్తోంది.

 

అభ్యర్ధుల్లో ఎవరెవరిని టార్గెట్ చేసుకోవాలనే విషయంలో కూడా మావోయిస్టులు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారట. అభ్యర్ధుల ప్రచారం చేయబోతున్న ప్రాంతాలు, తేదీలతో సహా సేకరించారట. టార్గెట్ రీచ్ అవ్వటం కోసం మావోయిస్టులు నాలుగు చిన్న చిన్న బృందాలుగా విడిపోయి సంచరిస్తున్నట్లు సమాచారం. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోని గుండాల, చర్ల, భద్రాచలం అటవీ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ ఇప్పటికే ప్రారంభించారు. అంతేకాకుండా అభ్యర్ధులకు పోలీసుల భద్రతను కూడా పెంచారట.

 

తెలంగాణా ప్రాంతంతో బాగా సంబంధాలున్న మావోయిస్టులతో పాటు చత్తీస్ గఢ్ కు చెందిన మావోయిస్టులను  జతచేసి పంపారట. చత్తీస్ గఢ్ నుండి వచ్చిన మావోయిస్టులుగా అనుమానిస్తున్న లింగయ్య, మంగు, రమేష్ , మంగతు, గంగ, పండు తదితర మావోయిస్టుల ఫొటోలను పోలీసులు ఇఫ్పటికే ప్రచారంలోకి తెచ్చారు. పై మావోయిస్టుల సంచారంపై సమాచారం ఇచ్చిన వారికి రూ 5 లక్షల బహుమానమంటూ పోలీసులు పెద్ద పోస్టర్లను కూడా విడుదల చేయటం గమనార్హం. మావోయిస్టుల కదలికలు, ఆపరేషన్స్ లో బాగా అనుభవం ఉన్న పోలీసు అధికారుల నేతృత్వంలో భారీ ఎత్తున పోలీసులను గాలింపు చర్యలకు వినియోగిస్తున్నారు. దాంతో ఎప్పుడేమవుతుందో కూడా తెలియక అభ్యర్ధులు టెన్షన్  పడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: