గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అభ్యర్ధి తరపున నామినేషన్ రిజెక్ట్ అవ్వటం ఇదే మొదటిసారి. దాంతో దాసోజుకు పెద్ద షాక్ కొట్టినట్లైంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఖైరతాబాద్ లో నామినేషన్ వేయటానికి దాసోజు శ్రవణ్ తరపున ఆయన సహచరులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలు కూడా అందించారు. అయితే, పత్రాలను చెక్  చేసిన రిటర్నింగ్ అధికారి ముషారఫ్ ఫారుఖి నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

 

ఇంతకీ అభ్యర్ధి తాలూకు నామినేషన్ ఎందుకు రెజెక్టు చేసినట్లు ? ఎందుకంటే, నామినేషన్ వేసే సమయంలో అభ్యర్ధి ఉండాలట. లేకపోతే అభ్యర్ధి తరపున ప్రపోజ్ చేసే ఓటరైనా ఉండాలట. ఇద్దరూ లేకపోతే నామినేషన్ తీసుకునేందుకు లేదని నియమాలు చెబుతున్నాయట. దాసోజు విషయంలో నియమానికి విరుద్ధంగా మద్దతుదారులు మాత్రమే నామినేషన్ పత్రాలను తీసుకురావటంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మరి దాసోజు కానీ లేకపోతే ప్రపోజ్ చేసిన ఓటరు కానీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఎందుకు రాలేదో అర్ధం కావటం లేదు.

 

ఖైరతాబాద్ నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం దాసోజు ఎంతగా పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. అసలు దాసోజు అభ్యర్ధిత్వాన్ని ముందు కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు. దాంతో అందుబాటులో ఉన్న మార్గాల్లో దాసోజు పెద్ద పోరాటమే చేయాల్సొచ్చింది. మొత్తానికి ఆయన గోడును గమనించిన అధిష్ఠానం చివరకు టిక్కెట్టు కేటాయించింది. అటువంటిది నామినేషన్ వేసేటపుడు దాసోజు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇంకోరు చెప్పక్కర్లేదు. పైగా దాసోజు చాలా సీనియర్ నేత. అటువంటిది తనకు వ్యక్తిగతంగా హాజరుకావటం సాధ్యం కానపుడు నియమాల ప్రకారం ప్రపోజ్ చేసిన ఓటరైనా ఉండేట్లు చూసుకునుండాలి. మరిపుడు దాసోజు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: