తెలంగాణాలో ఎన్నికల వేడి బాగా రాజుకుంటోంది. అన్నీ పార్టీల్లోను ఇంకా ప్రకటించాల్సిన నియోజకవర్గాలున్నప్పటికీ దాదాపు 90 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక అయిపోయిందనే చెప్పాలి. కొన్ని స్ధానాల్లో అభ్యర్ధులు ఎవరో ఇంకా తేలలేదు. ఈ సమస్య ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు. అధికార టిఆర్ఎస్ తో పాటు మహాకూటమిలోని పార్టీలు, బిజెపి, వామపక్షాల్లో కూడా ఇదే సమస్యతో అధినేతలు ఇబ్బంది పడుతున్నారు. సరే అభ్యర్ధులదేముంది లేండి రేపో ఎల్లుండో ఫైనల్  చేస్తారు.

 

ఇవన్నీ ఒక ఎత్తైతే పోటీలో ఉన్న అభ్యర్ధుల ఖర్చు మాటేమిటి ? పోటీలో ఉన్న వారికి మంచిపేరున్నంత మాత్రాన చాలదు కదా ? అసలైన ఇంధనం ధనమే అన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. జనరల్ నియోజకవర్గం, రిజర్వుడు అన్న తేడాల్లేకుండా కోట్లాది రూపాయలు ఖర్చుకు సిద్ధపడే వాళ్ళనే అన్నీ పార్టీలు ఎంపిక చేస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల సంగతి పక్కన పెట్టినా రిజర్వుడు నియోజకవర్గాల్లో మాత్రం పెద్దగా ఖర్చయ్యేది కాదు. కానీ పోయిన ఎన్నికల నుండి సీన్ మొత్తం మారిపోయింది. ఇక వచ్చే ఎన్నికల సంగతి చెప్పేదేముంది ?

 

పార్టీల్లోని నేతల అంచనా ప్రకారం రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా సగటున సుమారు రూ 7 కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా.  ఇక జనరల్ నియోజకవర్గాల సంగతి సరే సరి. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఖర్చు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోయిన ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ అభ్యర్ధికి అయిన ఖర్చు రూ 16 కోట్లట. ఇది ఐదేళ్ళ క్రిందటి మాట లేండి. మరి రేపటి ఎన్నికల్లోనో ? సింపుల్ గా చెప్పాంటే ఖమ్మంలో ఖర్చును సుమారుగా 25-30 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఆస్ధాయిలో ఖర్చును పెట్టుకోగలిగిన నేతలను అన్నీ పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి లేండి.

 

అందుకే తెలంగాణాలోని ఖరీదైన నియోజకవర్గాల జాబితాలోకి ఖమ్మం అసెంబ్లీ కూడా ఎక్కేసింది. మరి మిగిలిన నియోజకవర్గాలేంటో చూద్దామా ? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఖర్చుల విషయంలో మిగిలిన నియోజకవర్గాలకన్నా ముందుంటాయని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్ధులందరూ బాగా బిగ్ షాట్సేనట. ఎలాగంటే రియల్ ఎస్టేటే ప్రధాన కారణం. అభ్యర్ధుల్లో అత్యధికుల ప్రధాన ఆదాయ వనరు రియల్ ఎస్టేట్ రంగమే.

 

పై నియోజకవర్గాల తర్వాత ఖరీదైనవిగా ప్రచారంలో ఉన్నవి షాద్ నగర్, సిరిసిల్ల, మంచిర్యాల, కోదాడ, కొడంగల్, మహబూబాబాద్, హుజూర్ నగర్, సూర్యాపేట, మునుగోడు, వరంగల్ ఈస్ట్, వెస్ట్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, గజ్వేల్, పాలేరు, మేడ్చెల్ నియోజకవర్గాలున్నాయని సమాచారం. ఈ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి ఖర్చు సుమారు రూ 30 కోట్లపై మాటేనట. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఓటుకు అభ్యర్ధి చేసే ఖర్చు సగటున రూ 2 వేలట. కానీ పైన చెప్పుకున్న నియోజకవర్గాల్లో మాత్రం ఖర్చు సగటున రూ 4 వేలని సమాచారం. విచిత్రమేమిటంటే,  ఎన్నికల నిబంధనల ప్రకారం చేయాల్సిన ఖర్చు రూ 25 లక్షలే.  నిబంధనల ప్రకారం చేయాల్సిన ఖర్చు ఎంత ? వాస్తవంగా జరుగుతుందని అంచనా వేస్తున్న ఖర్చు ఎంత ?


మరింత సమాచారం తెలుసుకోండి: