తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపుపై నేతలు భగ్గుమంటున్నారు. టికెట్లు పొందిన నేతలు సంతోషంగా ఉంటే, దక్కని వారు నిప్పులు కురిపిస్తున్నారు. కొందరు రెబల్స్‌గా పోటీలో దిగేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు కార్యకర్తలు భావిస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. బీసీలు రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చారని, విద్యార్థులు కూడా అసంతృప్తితో ఉన్నారని... దీనికంతా ఎవరు కారణమని ప్రశ్నించారు. గత కొంత కాలంగా ఖమ్మం టికెట్‌ను ఆమె ఆశించారు. అయితే, కూటమి పొత్తుల్లో భాగంగా టికెట్ నామా నాగేశ్వరరావుకు వెళ్లింది. అయితే, కాంగ్రెస్ నుంచి ఒక్క కమ్మ సామాజిక వర్గానికి కూడా టికెట్ రాలేదని ఆమె మండిపడుతున్నారు.


రాష్ట్రంలో రెండు శాతం కూడా లేని రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ టికెట్లు దక్కాయని, తమ ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఎన్నో రకాలుగా బలమైన కమ్మ సామాజికవర్గానికి ఏ ధైర్యంతో టికెట్ ఇవ్వలేదని రేణుక మండిపడ్డారు. టికెట్లు పొందిన ఇతర సామాజికవర్గ నేతలంతా సరైనవారు, బలమైనవారా? అని ప్రశ్నించారు. మిగిలిన కులాల వారంతా గెలిచేవారేనా? అని అడిగారు. కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా? అని దుయ్యబట్టారు.  పదేళ్లుగా కార్యకర్తలను కాపాడుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడు మళ్లీ ఐదేళ్లపాటు జెండా ఎవరు మోస్తారని రేణుకాచౌదరి ప్రశ్నించారు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను పోటీ చేయాలనుకోవడం లేదని తెలిపారు. తాను టికెట్ అడిగితే కాదనే సత్తా ఎవరికీ లేదన్నారు.


అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అధిష్టానాన్ని హెచ్చరించారు. సమసమాజం అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధీల సిద్ధాంతమని... సిద్ధాంతానికి విరుద్ధంగా రాష్ట్ర నేతలు వ్యవహరించారని రేణుక విమర్శించారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చకూడదనే తాను ఆవేదనను దిగమింగుకుంటున్నానని చెప్పారు. రేపటి ఫలితాలు వ్యతిరేకంగా వస్తే... దీనికి కారణమైన నేతలంతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందేనని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: