వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ఎంఎల్ఏలకు టిక్కెట్టు విషయంలో చంద్రబాబునాయుడు హ్యాండ్ ఇవ్వటం ఖాయమని తేలిపోయింది. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇద్దరు ఎంఎల్ఏలకు టిక్కెట్టు విషయంలో స్పష్టంగా చెప్పేశారట. దాంతో వాళ్ళిద్దరూ ఇపుడు మండిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రకాశం జిల్లాలో ఈమధ్యే చంద్రబాబు రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఒంగోలు ఎంపిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తారని చెప్పేశారు. అదే సమయంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎంఎల్ఏలుగా గట్టి వాళ్ళను చూసుకునే అవకాశం మాగుంటకు ఇచ్చారు. దాంతో ఇద్దరు ఎంఎల్ఏలకు మూడింది.

 

నిజానికి ఒంగోలు ఎంపిగా పోటీ చేసేందుకు టిడిపిలో గట్టి అభ్యర్ది లేరనే చెప్పాలి. ఒక విధంగా నేతల్లో చాలామంది వెనకాడుతున్నారు. అందుకనే వేరేదారి లేక మాగుంటనే పోటీ చేయాల్సిందిగా  చంద్రబాబు గట్టిగా ఒత్తిడి పెడుతున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా పోటీ చేయటానికి రెడీ అవుతున్న మాగుంట తన డిమాండ్ల చిట్టాను కూడా విప్పారట. అందులో భాగంగానే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగ్గురిని మార్చాలని చెప్పారట. అంతేకాకుండా తాను సూచించిన వారికే అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబట్టారట. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారు.

 

అక్కడి నుండే మాగుంట సొంతంగా కసరత్తు మొదలుపెట్టేశారు. ఈమధ్యనే మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరిని కలిసి జిల్లా రాజకీయాలను చర్చించారు. రెండు నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలను మార్చాల్సిందేనంటూ మాగుంట పట్టుపట్టినట్లు సమాచారం.  కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలుగా ఉన్న కదిరి బాబురావు, డేవిడ్ రాజులను మార్చాల్సిందేనంటూ గట్టిగా చెబుతున్నారట. దాంతో చంద్రబాబు కూడా అంగీకరించారు. అదే విషయాన్ని  ఇద్దరు ఎంఎల్ఏలకు చంద్రబాబు చెప్పేశారని పార్టీ వర్గాలు చెప్పాయి.

 

పోయిన ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో కదిరి బాబురావు అతికష్టం మీద గెలిచారు. అయితే,  నియోజకవర్గంలో జనాలకు పెద్దగా అందుబాటులో ఉండరన్నది ప్రధాన ఆరోపణ. అలాగే డేవిడ్ రాజు పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచారు. తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. దాంతో ఎంఎల్ఏపై జనాల్లో బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. వివిధ సర్వేల ద్వారా తెప్పించుకున్న నివేదికల ప్రకారం వారిద్దరినీ మార్చాల్సిందేనని చంద్రబాబు కూడా అనుకున్నారు. అంటే మాగుంట డిమాండ్ చేసింది చంద్రబాబు నిర్ణయించుకున్నది ఒకటే అయినట్లైంది.

 

అదే సమయంలో మార్కాపురంలో ఇన్చార్జిగా ఉన్న నారాయణరెడ్డి స్ధానంలో కొత్తగా మరో నేతను రంగంలోకి దింపాలని మాగుంట ప్రతిపాదించారు. నారాయణరెడ్డి స్ధానంలో మాజీ ఎంఎల్ఏ ఉగ్రనరసింహారెడ్డిని తెస్తున్నారు. కాబట్టి ఈయనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. కనిగిరిలో రెడ్డి సామాజికవర్గం నేతను బరిలోకి దింపుతారని, ఎర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబుకు టిక్కెట్టు ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద మాగుంట ఎంపిగా పోటీ చేయటం ఎలాగున్నా ఇద్దరు ఎంఎల్ఏలకు మాత్రం చంద్రబాబు హ్యాండ్ ఇవ్వక తప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: