సోదరి నామినేషన్ సందర్భంగా సోదరులు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ పెట్టిన ట్వీట్ తెలుగుదేశంపార్టీలో సంచలనంగా మారింది. దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కుకట్ పల్లి నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్ వేశారు. తెలుగుదేశంపార్టీ తరపున సుహాసిని నామినేషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సోదరికి శుభాకాంక్షలు చెబుతూ సోదరులు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ ఓ ట్వీట్ పెట్టారు.

 

సోదరులిద్దరూ కలిసి ఒకే జూనియర్ ఎన్టీయార్ ట్విట్టర్ ఖతా నుండే ట్వీట్ చేయటం గమనార్హం. ఆ ట్వీట్ లో ఎక్కడ కూడా టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కానీ బాబాయ్ నందమూరి బాలకృష్ణ పేరుకానీ కనీసం ప్రస్తావించలేదు. పైగా తమ తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు స్ధాపించిన తెలుగుదేశంపార్టీ తమకెంతో పవిత్రమైనదిగా చెప్పుకున్నారు. అంటే టిడిపిని చంద్రబాబు కబ్జాచేసి సొంతం చేసుకున్నారన్నమాటను అందరికీ గుర్తుచేసినట్లైంది.

 

తమ తండ్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ సేవలందించిన తెలుగుదేశంపార్టీ తరపున తమ సోదరి సుహాసిని కుకట్ పల్లి పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అన్నారు. అంటే టిడిపి తమ తాత తర్వాత తమ తండ్రికే వస్తుందని చెప్పకనే చెప్పారు. తమ సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు మాత్రమే చెప్పారు. అంతేకాని నందమూరి అభిమానులు, తమ అభిమానులు సుహాసిని విజయానికి కృషి చేయాలని ఎక్కడా పేర్కొనలేదు.

 

అంతేకాకుండా సుహాసిని గెలుపుకు తాము ప్రచారం చేస్తామని కూడా కమిట్ అవ్వలేదు. రేపు ప్రచారానికి వస్తారా లేదా అన్నది వేరే సంగతి. నామినేషన్ వేసిన సందర్భంగా సుహాసిని కూడా సోదరుల ప్రచారం గురించి అడిగినా దాటవేయటం గమనార్హం. ఈ ట్వీట్ ద్వారా అర్ధమైందేమిటంటే, చంద్రబాబుకు తమకు సంబంధం లేదని. అంతేకాకుండా తెలుగుదేశంపార్టీ తమదే అని చెప్పినట్లుంది.

 

టిడిపి తరపున తమ సోదరి సుహాసిని పోటీ చేయటం సోదరులకు ఇష్టం ఉన్నట్లు లేదు. ఎందుకంటే, సుహాసిని స్ధానంలో ముందుగా కల్యాణ్ రామ్ తోనే పోటీ చేయించాలని చంద్రబాబు అనుకున్నారు. అనుకున్నట్లుగానే గాలం వేశారు. అయితే, చంద్రబాబు గాలానికి కల్యాణ్ తగులుకోలేదు. దాంతో కుటుంబపరంగ వాళ్ళని ఒప్పించటం కష్టమని భావించిన చంద్రబాబు పార్టీ పరంగా నరుక్కుని వచ్చారు. పార్టీ సీనియర్ నేత అయిన చుండ్రు శ్రీహరి కోడలే సుహాసిని. అందుకనే సుహాసినితో మాట్లాడి పోటీ చేయించేందుకు ఒప్పించటం తేలికైంది. ఒకవైపు సోదరి, మరోవైపు చంద్రబాబుతో వైరం. అందుకనే సోదరులిద్దరూ జాగ్రత్తగా ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: