తనపై జరిగిన హత్యాయత్నం వెనక చంద్రబాబే అసలు కుట్రదారు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తనను భౌతికంగా అంతమొందించాలని చూశారని, ప్రజల దీవెనల వల్లనే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. ఆపరేషన్ గరుడ పేరు మీద తనను చంపాలని చూశారని జగన్ ఆవెదన వ్యక్తం చేశారు. ఒక ప్రతిపక్ష నాయకున్ని అంతమొందించేందుకు దుర్మార్గం జరగడం దేశంలో ఎక్కడా లేదని ఆయన మండిపడ్డారు.


సినీ యాక్టర్ బాబు మనిషే:


ఆపరేషన్ గరుడ కధ చెప్పిన శివాజీ చంద్రబాబు ఆప్తుడని అన్నారు. మార్చిలోనే తనను అంతమొందించేందుకు కుట్ర పన్నారని చెప్పుకొచ్చారు. మార్చ్ 8న కేంద్రం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారని 22న ఆపరేషన్ గరుడ అంటూ డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. తనన్ను ఎయిర్ పోర్టు లో అంతం చేస్తే కేంద్రం పరిధిలోనిది కాబట్టి తన మీదకు ఏ నేరం రాదనుకున్నారు. ఒకవేళ హత్యాయత్నం విఫలమైతే ఆపరేషన్ గరుడ పేరు మీద తోసేయవచ్చు అని అనుకున్నారని జగన్ అన్నారు. ఈ మొత్తం  కుట్ర కు సూత్రధారి చంద్రబాబే అన్ని కుండ బద్దలు కొట్టారు.


అవినీతిని ప్రశ్నించినందుకే :


తాను పాదయ‌త్ర ద్వారా జనంలోకి వెళ్ళి ఎండగడుతూంటే చంద్రబాబు కక్ష కట్టారని, అవినీతిని ప్రశ్నించినందుకే తనను లేకుండా చేయాలనుకున్నారని జగన్ అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటీన్ యజమాని  హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి అని,  ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పారు. అతని దగ్గరే తనపై హత్య చేసిన నిందితుడు పనిచేశాడని జగన్ చెప్పారు. 
ఈ హత్య జరిగిన తరువాత ఒక్కోటీ కుట్ర కోణం బయటపడుతూంటే బాబు మాత్రం  కేసును తప్పు దోవ పట్టించేందుకు చూశారని అన్నారు. మంత్రులు, డీజీపీ కూడా అదే పాట పాడారని, తన అభిమాని అయితే తనను ఎందుకు అంతం చేస్తాడో బాబు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 


సీబీఐ వేసే దమ్ముందా :


తనపై జరిగిన హత్యా యత్నం విషయంలో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణ జరిపించే దమ్ము ఉందా అని ఆయన ప్రశ్నించారు.  సీబీఐ ఎక్కడ ఈ కేసులో విచారణకు ఆదేశిస్తుందో అని కంగారు పడి బాబు ఇపుడు సీబీఐ వద్దు అంటున్నారని జగన్ విమర్శించారు.
నాడు తనను జైల్లో పెట్టించినపుడు సీబీఐ ముద్దుగా బాబుకు అనిపించిందా  అని ఆయన నిలదీశారు. బాబు లాంటి మోసగాడు ప్రపంచ చరిత్రలో లేనే లేరని జగన్ అన్నారు. తనను తొలగించాలని చూసిన తాను భయపడనని చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సేవ చేస్తూనే వుంటానని జగన్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: