మహాకూటమిలోని టిజెఎస్ పార్టీ అధినేత కోదండరెడ్డికి కాంగ్రెస్ ఫార్టీ పెద్ద షాకే ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా టిజెఎస్ కు కేటాయించిన ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తమ నేతలకు బిఫారాలు అంద చేసింది. దాంతో కోదండకు కాంగ్రెస్ రాజకీయం అర్ధం  కావటం లేదు. ఈరోజే నామినేషన్లు వేయటానికి ఆఖరు రోజు కావటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదుగురు సీనియర్ నేతలకు ముందుజాగ్రత్తగా బిఫారాలు అందిచటం కలకలం రేపుతోంది. మహాకూటమిలో కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు. ఎవరికి వారుగా తమకే ఆ నియోజకవర్గాలు కావాలని పట్టుబడుతున్నారు.

 

ఈ నేపధ్యంలోనే చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడకపోవటంతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఐదుగురు నేతలకు బిఫారాలు ఇచ్చేసి నామినేషన్లు వేయమని చెప్పేశారు. దాంతో వాళ్ళు నామినేషన్లు వేయటానికి రెడీ అయిపోతున్నారు. కాంగ్రెస్ తాజా రాజకీయాలు చూసి కోదండకు షాక్ కొట్టినట్లైంది. ఈరోజు నామినేషన్లు వేసేస్తే విత్ డ్రాయల్ కు ఎటూ మూడు రోజుల సమయం ఉంటుంది కాబట్టి ఈలోగా సీట్ల సర్దుబాటు చేసుకుని తమ నేతలతో నామినేషన్లు ఉపసంహరణ చేయించాలన్నది ఉత్తమ్ ఆలోచనగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే వారి మాటలను ఎవరూ నమ్మటం లేదు.

 

 టిజెఎస్ అధ్యక్షుడు కోదండ సిద్దిపేట, మెదక్, దుబ్బాక, మల్కాజ్ గిరి, మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్ లో ఏడుగురు అభ్యర్ధులకు బిఫారాలు ఇచ్చారు. నామినేషన్లు వేయటానికి వాళ్ళు రెడీ అయ్యారు. అయితే, వారితో పాటు వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ, మల్కాజ్ గిరి, మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కూడా నామినేషన్లు వేయటానికి రెడీ అవుతుందటంతో టిజెఎస్ అభ్యర్ధులకు మతిపోయింది.


అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టిడిపి తరపున ఎర్ర శేఖర్ ఆల్రెడీ నామినేషన్ వేసేశారు. ఇబ్రహింపట్నంలో ఒకవైపు టిడిపి సామారంగారెడ్డిపై బిఫారం ఇవ్వగా మరోవైపు కాంగ్రెస్ మల్ రెడ్డి రంగారెడ్డికి కూడా నామినేషన్ అందించింది. మొత్తానికి మహాకూటమిలో మహా గందరగోళం చోటు చేసుకోవటం ప్రత్యర్ధులకు ఆయుధాలను అందించినట్లైంది.


ప్రత్యర్ధుల విషయంలో ఏమో కానీ జనాలు ముందు కూడా మహాకూటమిలో టిక్కెట్ల గోలతో బాగా పలుచనైపోతోంది. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్ధులు ఫైనల్ కాకపోవటం బహుశా ఇదే మొదటిసారి. మహాకూటమిలో పార్టీలెక్కువైపోవటం, ఒకే సీటుపై అన్నీ పార్టీలు పట్టుబడుతుండటంతో గందరగోళం పెరిగిపోయింది. అంటే, టిఆర్ఎస్, బిజెపీల్లో కూడా దాదాపు ఇదే పరిస్ధితుందనుకోండి అది వేరే సంగతి. మరి ఎప్పటికి ఈ కన్ఫ్యూజ్ క్లియర్ అవుతుందో ఏమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: