అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తుందట జనసేన. విచిత్రంగా లేదు ప్రకటన. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేక పోయామని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయవద్దన్నారు? పార్లమెంటు ఎన్నికల్లో పోటీ  చేయమని ఎవరు ఒత్తిడి తెస్తున్నారు ? పవన్ చెబుతున్నదంతా ఉత్త సోది తప్ప ఇంకేమీ కాదు. తెలంగాణాలో కూడా పోటీ చేయాలని అనుకున్నా ఎన్నికలు హఠాత్తుగా ముందుకు వచ్చేసరికి పోటీ చేయటం కుదరలేదట. ఎన్నకిల్లో పోటీ చేయలేకపోవటానికి సాకు చెప్పినా అతికినట్లుండాలి.

 

తెలంగాణాలో షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు జరుగుతాయని దాదాపు రెండు మూడు నెలల క్రితం నుండే జరుగుతున్న ప్రచారం పవన్ కు తెలీదా ? మరి ఏం ఆశించి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు  చేశారు. అప్పటికే ముందస్తు ఎన్నికల ఊహాగానాలును మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగుంటే పోటీ చేసేవారమని మళ్ళీ సాకొకటి. ముందస్తు ఎన్నికల్లో అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ లు ఇబ్బందులు పడటం లేదా ? అంతెందుకు అధికార టిఆర్ఎస్ పార్టీలో తిరుగుబాట్ల మాటేమిటి ? అభ్యర్ధుల సమస్య అన్నీ పార్టీలోను ఉంది. మరి జనసేన ఎందుకు ఎన్నికలకు దూరమైంది ?

 

ఎందుకంటే, జనసేనకు అభ్యర్ధుల కరువు కాబట్టే. జనసేన తరపున పోటీ చేయటానికి అభ్యర్ధులే దొరక్కపోయుండాలి. లేకపోతే తెరవెనకాల కెసియార్ తో ఒప్పందమైనా జరిగుండాలి. పోటీ నుండి దూరమవ్వటానికి ఏదో ఒక కథ చెబితే నిజమనుకునేంత  వెర్రివాళ్ళెవరూ లేరన్న విషయం పవన్ ముందు గ్రహించాలి. పైగా తెలంగాణా ప్రజల పక్షాన నిలబడటమే తమ పార్టీ లక్ష్యమని కథలు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోను పోటీ చేస్తామని చెబుతున్న పవన్ ఏపి అసెంబ్లీ ఎన్నికల మాట మాత్రం ఎత్తలేదు. అంటే ఏపిలో కూడా అసెంబ్లీ ఎన్నికల విషయంలో  ఏదో ఓ కథ చెప్పేద్దామని అనుకుంటున్నారా ? ఏమో ఏమైనా చేయగలరు సినిమాల్లో నుండి వచ్చారు కదా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: