రెండో విడత ప్రచారం మొదలుపెట్టిన మొదటిసభలోనే చంద్రబాబునాయుడుపై కెసియార్  రెచ్చిపోయారు. ప్రచారం కోసం తెలంగాణాలోకి అడుగుపెడితే మర్యాదగా ఉండదంటూ సివియర్ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఖమ్మం జిల్లా పాలేరు ప్రచారంలో మాట్లాడుతూ జిల్లాలో ఒకపుడు సీతారామ ప్రాజెక్టును అడ్డుకున్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారంటూ నిలదీశారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖ రాసిన చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వస్తే మర్యాదగా ఉండదంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటంపై చర్చ జరుగుతోంది.

 

నిజానికి ఇటువంటి హెచ్చరికలు  చేయటం ఎవరికీ తగదు. అప్పుడెప్పుడో ప్రాజెక్టును అడ్డుకున్నారని, ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నేతలను ఎన్నికల్లో అడ్డుకోవటం మొదలుపెడితే కెసియార్ ను కూడా అడ్డుకోవాల్సిందే. ఎందుకంటే, ప్రత్యేక తెలంగాణా వస్తే రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడంటూ బహిరంగ సభలో చెప్పారు. కెసియార్ చెప్పినట్లే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వచ్చింది. ఎన్నికలు జరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి దళితుడు ముఖ్యమంత్రయ్యాడా ? ముఖ్యమంత్రిగా కెసియారే ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో దళితుడిని కూర్చో పెడతానని బహిరంగంగా చెప్పిన కెసియార్ తానే సిఎంగా బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు ?

 

మరి సిఎం పదవి విషయంలో మాట తప్పిన కెసియార్ మాత్రం ఓట్ల కోసం ఎందుకు వస్తున్నట్లు ? ఇవే గాకుండా చాలా ప్రమాణాలు చేసి చాలా హామీలను తప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమిని పంచారా ? ఇలా చెప్పుకుంటే కెసియార్ కూడా చాలా  హమీలనే తప్పారు. కాబట్టి  చంద్రబాబుపై ఒంటికాలిపై లేవటం మానేసి తన పార్టీ ప్రచారమేదో తాను చేసుకోవటం ఉత్తమం. టిఆర్ఎస్ లోనే గెలుపుకు ఎదురీదుతున్న అభ్యర్ధులు చాలామందే ఉన్నారు. కాబట్టి తన అభ్యర్ధులను గెలిపించుకునే సంగతేదో చూసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: