చూడబోతే క్షేత్ర స్ధాయిలో పరిస్ధితులుఅలాగే కనిపిస్తున్నాయి. మొన్న రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కమిడి కళా వెంకట్రావు జనసే అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి రాసిన లేఖలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. తన లేఖలో విశాఖపట్నంలో జగన్ తో భేటీ అయ్యింది వాస్తవం కాదా ? అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 40 సీట్లు జగన్ ఆఫర్ చేసింది నిజమేనా ? అంటూ ప్రస్తావించారు. జగన్, పవన్ ఇద్దరిలో ఎవరిని ఎవరు కలిస్తే కళాకు వచ్చిన నొప్పేంటి ? వాళ్ళిద్దరు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే టిడిపికి వచ్చిన బాధేంటో అర్ధం కావటం లేదు. ఎప్పుడెవరితో అయినా పొత్తులు పెట్టుకునే స్వేచ్చ ఒక్క చంద్రబాబునాయుడుకు మాత్రమే ఉందా ? మిగిలిన పార్టీల నేతలెవరు తమిష్టం పార్టీలతో పొత్తులు పెట్టుకోకూడదా ? లేకపోతే పొత్తులు పెట్టుకోవటానికి చంద్రబాబు అనుమతి కావాలా ?

 

2014 ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగానే కదా చంద్రబాబు బిజెపి, పవన్ తో పొత్తు పెట్టుకున్నది ? కెసియార్ ను ఓడించేందుకే కదా తెలంగాణాలో కాంగ్రెస్ తో జత కట్టింది ? జాతీయ రాజకీయాల్లో బిజెపిని ఓడించేందుకే తాను బిజెపి వ్యతిరేక పార్టీలను కలుపుతున్నట్లు డప్పు వేయించుకుంటున్నది ? చంద్రబాబు ఏది చేసినా తన వ్యక్తిగత లబ్దిని ఆశించి మాత్రమే చేస్తారనటంలో సందేహం లేదు. చంద్రబాబుది  ఎప్పుడూ రెండే లక్ష్యాలు. మొదటిది తాను ఎవరితో కలిసినా తాను మ్యాగ్జిమమ్ లాభపడాలి. రెండోది తనతో కలిసిన వాళ్ళు నాశనమైపోవాలి.

 

చంద్రబాబు రాజకీయ చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ను వదిలి 1983లో టిడిపిలో  చేరిన దగ్గర నుండి అదే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం అర్ధమైపోతుంది. ఎన్టీయార్ ను పదవి నుండి దింపేటప్పుడు ఎన్టీయార్ కుటుంబం మొత్తాన్ని ఫుల్లుగా వాడేసుకున్నారు. తర్వాత వాళ్ళ బతుకులేమయ్యాయో అందరూ చూస్తున్నదే. రాష్ట్ర విభజనకు లేఖలు ఇవ్వటంలో కూడా తన వ్యక్తిగత లబ్దినే చూసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఎప్పటికీ ముఖ్యమంత్రయ్యే అవకాశం లేదని గ్రహించే విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

2014 ఎన్నికల్లో జగన్ ను ఒంటిరిగా ఎదుర్కోవటం కష్టమన్న భయం పెరిగిపోయింది. దేశమంతా నరేంద్రమోడి హవా ఉందని గ్రహించారు. అందుకే బిజెపి చీ పొమన్నా వదలకుండా వెంటపడి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళ తర్వాత మోడి గ్రాఫ్ పడిపోతోందని గ్రహించే ఆరుమాసాల క్రితం ఏకపక్షంగా బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, జాతీయ స్ధాయిలో పార్టీల మద్తతు అవసరమని గ్రహించే ఇఫుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.

 

అంటే చంద్రబాబు మాత్రం తనిష్టం వచ్చినట్లు పొత్తులు పెట్టుకోవచ్చు. ఇతరులు మాత్రం తనకు వ్యతిరేకంగా ఎవరు ఎవరితోను కలవకూడదు.  చూడబోతే జగన్, పవన్ ఎక్కడ కలుస్తారో అన్న భయం చంద్రబాబును వెంటాడుతున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. జగన్ ఒంటరిగానే చంద్రబాబుకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. దానికితోడు పవన్ కూడా కలిస్తే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. కెసియార్, మోడిని గద్దె దింపేందుకు చంద్రబాబు అందరినీ కలుస్తున్నపుడు జగన్, పవన్ మాత్రం చంద్రబాబుకు వ్యతరేకంగా ఎందుకు కలవకూడదనే ప్రశ్న జనాల్లో మొదలైంది. మరి రాబోయే ఎన్నకల్లో వాళ్ళిద్దరూ ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: