ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న పార్టీ జనసేన. రాజకీయాలను సమూలంగా మార్చేస్తానని చెబుతున్న జనసేనని రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ప్రధాన దృష్టి అంతా ఏపీ మీదే కేంద్రికరించారు. ప‌వ‌న్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేక ఇప్ప‌టికే చేతులు ఎత్తేసిన సంగ‌తి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొన్ని జిల్లాల్లో జనసేన ఎఫెక్ట్‌ బలంగా ఉంటుందని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రౌండ్‌ లెవల్లో పరిస్థితి కూడా ఈ వ్యాఖ్యలు నిజమనే చెబుతోంది. జనసేన పోటీకి రెడీ అవుతున్నా జనసేనాని తాను ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడన్నదానిపై మాత్రం సరైన క్లారిటీ ఇప్పటి వరకు లేదు. పవన్‌ ఇప్పటికే ఏడెనిమిది నియోజకవర్గాల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించి పెద్ద గందరగోళానికి తెర తీశాడు. 


చివరకు పాయకరావుపేట, పాడేరు లాంటి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు అక్కడ నుంచి తాను పోటీ చేస్తానని చెప్పడంతో సగటు ఓటరు సైతం అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్‌ అవేశంలో ఈ ప్రకటనలు చేసి ఉండొచ్చు. పవన్‌ ముందుగా అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు తాను వెనకబడిన ప్రాంతమైన ఈ జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేసితీరుతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే అనంతపురం సిటీ సీటుతో పాటు కదిరి నియోజకవర్గాల పేర్లు బలంగా వినిపించాయి. అదే జిల్లాలోని గుంతకల్లు కూడా తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత తన సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, నరసాపురం, పాలకొల్లు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం పవన్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. 


కొద్ది రోజులుగా పవన్‌కళ్యాణ్‌ జనసేన ప్రభావం బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీకి దిగుతారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా జనసేన రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్‌ కమిటి సభ్యులు ముత్తా గోపాల్‌కృష్ణ‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు కారణం కాబోతున్న పవన్‌కళ్యాణ్‌ తమ జిల్లా నుంచే పోటీ చేస్తున్నారని ప్రకటించారు. పవన్‌ జిల్లాలోని కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి పోటీకి సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ పవన్‌ సొంత సామాజికవర్గం అయిన కాపు సామాజికవర్గ ప్రాబ‌ల్యం బలంగా ఉంది. 


పవన్‌ ఈ మూడు సీట్లల్లో ఎక్కడ పోటీ చేసినా పవన్‌ సొంత సామాజికవర్గం, జనసైనికులు, ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆయన గెలుపులో కీలకంగా మారతారు అనడంలో సందేహం లేదు. కాకినాడ సిటీలో కాపులు కీలక పాత్ర పోషిస్తారు. కాకినాడ రూరల్లో ఈ సామాజికవర్గానిదే ఆధిపత్యం. అలాగే పక్కనే ఉన్న పిఠాపురంలో కూడా కాపు సామాజికవర్గం ఎక్కువ. పవన్‌ ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చిన ముత్తా గోపాలకృష్ణ‌ పవన్‌కు ఇక్కడ పోటీ చేస్తే 70వేల మెజారిటీకి తక్కువ కాకుండా గెలిపించుకుంటామని ఇందుకోసం పార్టీ యంత్రాంగం ఇప్పటికే సమిష్టిగా గ్రౌండ్‌ లెవల్లో కృషి చేసిందని కూడా చెప్పారు.

Image result for elections

పవన్‌ను కులమే గెలిపిస్తుందా..?
పవన్‌ తన ప్రచారంలో తనకు కులాలు, మతాలతో పట్టింపు లేదని తాను అందరి వాడినని చెప్పుకుంటున్నారు. పవన్‌ ఇప్పటికే చాలా సార్లు వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఏ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటే తాను ఆ కులానికి చెందినవాడినని చెప్పుకుంటు వస్తున్నారు. కాని పవన్‌ మాటల వరకు ఎలా ఉన్నా చేతల్లో మాత్రం తన కులాన్నే నమ్ముకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జనసేనకు ఆయన సొంత సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లోనే మంచి పట్టు ఉందని... పవన్‌ అక్కడే కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చేపుతారన్నది అందరికి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పి చివరకు జనసేన బలంగా ఉన్న తూర్పుగోదావరి నుంచే పోటీ చెయ్యాలని ప్లాన్‌ చేసుకోవడం బట్టీ చూస్తే పవన్‌ తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు కూడా సొంత సామాజికవర్గాన్నే నమ్ముకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: