మొత్తానికి మహాకూటమిలోని పెద్ద పార్టీలైన కాంగ్రెస్, టిడిపిల మధ్య నియోజకవర్గాల్లో సయోధ్య కుదరుకుంటోంది. తాజాగా గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి నేతలు కలిసిపోవటమే అందుకు ఉదాహరణ. ఈ నియోజకవర్గం కోసం రెండు పార్టీల నేతలు పట్టుపట్టారు. కాంగ్రెస్ కార్తీక్ రెడ్డితో సహా కనీసం పదిమంది కన్నేశారు. టిడిపిలో కూడా ఓ ఆరుమంది సీనియర్ నేతలు దృష్టి పెట్టారు. అయితే, పొత్తుల్లో భాగంగా సీటును టిడిపికి వదులుకుంది కాంగ్రెస్. దాంతో కాంగ్రెస్ నేతలు మండిపోయారు. అందులో భాగంగానే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ పార్టీకి రాజీనామా చేశారు.

 

కార్తీక్ రాజీనామా అంశం పదిరోజుల క్రితం పార్టీని కుదిపేసింది. టిడిపికి వచ్చిన సీటును చంద్రబాబునాయుడు గణేష్ గుప్తాకు కేటాయించారు. గుప్తా కూడా నామినేషన్ వేసేశారు. సీటును గుప్తాకు కేటాయించగానే టిడిపిలోని మిగిలిన నేతలు కూడా మండిపడ్డారు. తమకే టిక్కెట్టు కావాలంటూ ఎవరికి వారుగా పట్టుబట్టారు. దాంతో తెలుగుదేశంపార్టీలో కూడా గందరగోళం మొదలైంది. ఎవరికివారుగా నామినేషన్లు వేయటానికి కూడా రెడీ అయ్యారు. దాంతో టెన్షన్ పెరిగిపోయింది. సోమవారం గుప్తా నామినేషన్ వేసిన సమయంలో కార్తీక్ రెడ్డి, కాంగ్రెస్ నేతలతో పాటు అటు టిడిపిలోని ఆశావహులు కూడా హాజరుకాలేదు.

 

నామినేషన్ వేసిన తర్వాత గుప్తాతో పాటు మరికొందరు అగ్రనేతలు ఇటు కాంగ్రెస్ లోని సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డిలతో చర్చలు జరిపారు. అదే సమయంలో గుప్తాకు సబితా ఆశీర్వాదం కూడా లభించింది. గుప్తకు మద్దతుగా తల్లి సబితా నిలవటంతో కొడుకు కార్తీక్ కూడా మెత్తపడ్డారు. ఆశావహులను, అసంతృప్త నేతలను రేవంత్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని బుజ్జగించారు. ఎవరికి వారుగా విడిగా మాట్లాడిన తర్వాత రెండు పార్టీల నేతలు మెత్తపడ్డారు. దాంతో గుప్తాకు లైన్ క్లియర్ అయ్యింది.

 

టిడిపిలోని అసంతృప్త నేతలు గోపాల్, రామేశ్వరరావు, సూర్యప్రకాశ్ రావు, సామా భూపాల్ రెడ్డితో కూడా గుప్తా మాట్లాడి ప్రసన్నం చేసుకున్నారు. దాంతో సోమవారం రాత్రి అంతా కలిసి కాసేపు ప్రచారం చేయటంతో టిడిపి శ్రేణుల్లో సంతోషం కనిపించింది. అదే సమయంలో గుప్తాను వ్యక్తిగతంగా కార్తీక్ రెడ్డితో మాట్లాడి కన్వీన్స్ చేయటంతో కాంగ్రెస్ నేతలు కూడా మెత్తపడి ప్రచారానికి వస్తామని గుప్తాకు హామీ ఇచ్చారు. అదే విషయాన్ని గుప్తాతో పాటు రేవంత్ కూడా అగ్ర నేతలకు వివరించటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 

కాంగ్రెస్, టిడిపితో పాటు సిపిఐ, టిజెఎస్ పార్టీల నేతలతో త్వరలో బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ముందుగా సంయుక్త సమావేశం నిర్వాహిస్తామని తర్వాత బహీరంగసభ నిర్వహించనున్నట్లు గుప్తా ప్రకటించారు. రెండు పార్టీల నేతలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి ప్రచారం కూడా మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఆ బృందం సారధ్య  బాధ్యతలను కార్తీక్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు గుప్తా ప్రకటించటం గమనార్హం. ఈ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్ధిగా తాను విజయం సాధించటం కాయమంటూ గుప్తా చెబుతున్నారు.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: