ఏపీ ప్రజలు చీ కొట్టి ఆమడ దూరంలో పెట్టిన పార్టీని కోరి మరీ కౌగలించుకుని ఏపీలో ఊపిరి పోస్తానంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుది అపర చాణక్యమా, అమాయకత్వమా, లేక అవసరార్ధమా అన్నది అంతుపట్టకుండా ఉందని తమ్ముళ్ళు అంటున్నారు. ఏపీకి విభజన గాయలు చేసిన పార్టీతో చెలిమి అసలుకే చేటు అని కాంగ్రెస్ లో దశాబ్దాలుగా కలసి పని చేసిన వారు సైతం ఇప్పటికీ చెబుతున్నారు. దాంతో టీడీపీలో అంతర్మధనం జరుగుతోంది.


సీమరెడ్డి ఘాటు కామెంట్స్ :


కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి తాజాగా కాంగ్రెస్ పై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీని ఏపీ జనం నమ్మరు కాక నమ్మరు అంటూ మాటలతో బాంబులే వేశారు. సోనియాగాంధీ అనాలోచితంగా ఏపీని ముక్కలు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి లాంటి వారు ఎంతమంది చేరినా కూడా బతికి బట్టకట్టదని కూడా జోస్యం చెప్పేశారు. తాను మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం అన్నది జరిగే పని కాదని క్లారిటీ ఇచ్చేశారు. ఈయన టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాత్రం మండిపడుతున్నారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ వంచన జనం గుండెల్లో ఎలా ఉందన్నది నేతల మాటల బట్టే అర్ధం అవుతోంది.


టీడీపీలోనూ ఇదే వరస:


ఇక తెలుగు తమ్ముళ్ళు వీర శివారెడ్డి అంతలా గట్టినా చెప్పలేకపోవచ్చును కానీ వారి ఆవేదన కూడా అచ్చం అలాగే ఉంది. అనవసరంగా కాంగ్రెస్ తో పొత్తు అన్నది వారి భావనగా చెబుతున్నారు. కాంగ్రెస్ ని జనం ఎప్పటికీ క్షమించరని చెప్పిన తాము ఆ పార్టీతో కలిస్తే అర్ధం ఏముంటుందని కూడా వాదిస్తున్నారు. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ఇక్కడ పొత్తు ఉండదని కూడా మరికొంతమంది కోరుకుంటున్నారంటే ఈ బంధం ఎంతటి అసహ‌జమైనదో చూడాలి.


జాతీయ స్థాయిలోనూ:


ఇక జాతీయ స్థాయిలోనూ బాబుకు ఉన్న ఇమేజ్ వేరు. ఆయన కూటమి పేరుతో తిరుగుతున్న చోట వస్తున్న ఆదరణ వేరు. కాంగ్రెస్ తరఫున వస్తే మేము ఒప్పుకోమంటూ ఇద్దరు నారీమణులు బాబుకు ముఖం మీదే చెప్పేస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే కూటమికి మేమే సారధులం అని ప్రకటించుకున్నారు. మరో వైపు మాయావతి పార్టీ బీఎస్పీ అయితే బాబు కాంగ్రెస్ కి ముసుగు అంటూ పెద్ద మాటలనే ప్రయోగించారు. దీనిని బట్టి చూస్తే రాహుల్ కు జాతీయంగానూ పెద్ద  సానుకూలత లేదని తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ భారాన్ని బాబు ఎందుకు ఇపుడు తలెత్తుకున్నాడన్నది ఆయన వెంట ఉన్న సీనియర్లకే కాదు. తమ్ముళ్ళకూ అర్ధం కావడం లేదు. ఈ భారం సంగతి తెలంగాణా ఎన్నికల ముచ్చటే తీర్చాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: