అనంతపురం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతల్లో విభేదాలు తీవ్రస్ధాయికి  చేరుకుంటున్నాయ్. అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డికి, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎంఎల్ఏలకు ఏమాత్రం పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతకాలం ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో వాళ్ళని కెలికి జేసి రచ్చ చేస్తూ వచ్చారు. ఎంఎల్ఏల స్ధానంలో కొత్తవారిని పోటీలోకి దింపకపోతే పార్టీ ఓడిపోతుందని బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. బహిరంగంగానే జేసి ఎంఎల్ఏలపై ఫిర్యాదులు చేయటంతో ఎంఎల్ఏల్లో మండిపోయింది. ఎంఎల్ఏలంతా ఓ మాట మాట్లాడుకుని తాజాగా వారంతా కలిసి జేసికి రివర్స్ ఫిట్టింగ్ మొదలుపెట్టారని సమాచారం.

 

అనంతపురం లోక్ సభ పరిధిలో అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, కల్యాణదుర్గం, శింగనమల, ఉరవకొండ, గుంతకల్ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఉరవకొండలో మాత్రమే వైసిపి ఎంఎల్ఏ విశ్వేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో టిడిపి ఎంఎల్ఏలే ఉన్నారు. అనంతపురంలో ప్రభాకర చౌదరి, తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి, రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, కల్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, గుంతకల్లులో జితేందర్ గౌడ్, శింగనమలలో యామిని బాల ఉన్నారు. నిజానికి వీరిలో మెజారిటీ ఎంఎల్ఏల మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డమైన సంపాదనే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు.

 

అందుకనే వీరందరినీ మార్చేయాలని చంద్రబాబునాయుడుపై జేసి బాగా ఒత్తిడి పెడుతున్నారు. ఆ విషయాన్ని జేసి బహిరంగంగా చెప్పటంతోనే సమస్య మొదలైంది. పైగా కొత్తవారికి టిక్కెట్లివ్వమని చెప్పిన జేసి అంతటితో ఊరుకోలేదు. తాను చెప్పిన వారికే టిక్కెట్లివ్వాలని పట్టుపడుతున్న కారణంగానే ఎంఎల్ఏలందరూ ఇఫుడు జేసిపై మండుతున్నారు. ఎలాగైనా తన మద్దతుదారులకే టిక్కెట్లిప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో పై నియోజకవర్గాల్లో తన మద్దతుదారులను పోటీదారులుగా బాగా ప్రోత్సహిస్తున్నారు. దాంతో మంత్రి, ఎంఎల్ఏలకు, జేసి  మద్దతుదారులకు మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి.

 

తమకు వ్యతిరేకంగా తన మద్దతుదారులను ప్రోత్సహిస్తు తమను జేసి ఇబ్బంది పెడుతున్నట్లు ఎంఎల్ఏలు, మంత్రి చంద్రబాబుకు చెప్పినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే, మంత్రి, ఎంఎల్ఏలకన్నా జేసి బాగా పవర్ ఫుల్లు. ఆర్ధిక, అంగ బలంలో జేసికి ఎవరూ సరితూగలేరు.  ఆ విషయం బాగా తెలుసు కాబట్టే చంద్రబాబు కూడా పెద్దగా జోక్యం చేసుకోవటం లేదు. అయితే, ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా ఉపేక్షిస్తే లాభం లేదనుకున్న ఎంఎల్ఏలు, మంత్రి ఏకమయ్యారు.

 

వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా ఎంపిగా తన కొడుకు పవన్ రెడ్డి పోటీ చేస్తారని ఇఫ్పటికే జేసి బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్నే ఎంఎల్ఏలు వ్యతిరేకిస్తున్నారు. పవన్ రెడ్డి అయితే ఎంపి సీటు ఓడిపోవటం ఖాయమంటూ మంత్రులు, ఎంఎల్ఏలు రివర్స్ ఫిట్టింగ్ మొదలుపెట్టారు. అసలు జేసి మీదే జనాలు బాగా వ్యతిరేకంగా  ఉన్నారని  కాబట్టి ఎంపిగా కొత్త అభ్యర్ధిని పోటీలోకి దింపాలంటూ చంద్రబాబుకు చెప్పారట. తమపై జేసి ఇఫ్పటికే వ్యతిరేకంగా తన మద్దతుదారులను ప్రోత్సహిస్తున్న కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించారట. దాంతో ఎంపిగా పవన్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వటం సాధ్యం కాదని జేసికి చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారని సమాచారం. అంటే జేసిపై మంత్రి, ఎంఎల్ఏలు మొదటి సారి పై చేయి సాధించినట్లే కనిపిస్తోంది. మరి ఎన్నికలు సమీపించేసరికి సమీకరణలు ఏమవుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: