డిసెంబర్ 7వ తేదీలోగా టిఆర్ఎస్ లో మరో ఇద్దరు ఎంపిలు రాజీనామా చేస్తారా ? అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి.  తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ టిఆర్ఎస్ చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసియార్ ను వదలకుండా వెంటాడుతున్నారు. టిఆర్ఎస్ చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామాతో అసలే షాక్ కొట్టినట్లైన కెసియార్ ను రేవంత్ మరింత టెన్షన్ పెడుతున్నారు. మంగళవారం పార్టీకి కొండా రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల వేడి బాగా పుంజుకున్న నేపధ్యంలో ఎంపి పదవితో పాటు పార్టీకి కొండా రాజీనామా చేయటం నిజంగా కెసియార్ కు దెబ్బ అనే చెప్పాలి. రాజీనామా చేయకుండా ఆపేందుకు కెసియార్ ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

 

తెలంగాణా రాజకీయాల్లో కొండా రాజీనామానే ఇఫుడు హాట్ టాపిక్ గా మారింది.  ఈ విషయం ఇలా వుండగానే మరో ఇద్దరు ఎంపిలు కూడా తొందరలో టిఆర్ఎస్ కు రాజీనామా చేయటం కాయమంటూ మరో బాంబు పేల్చారు. దాంతో రేవంత్ వేసిన బాంబు దెబ్బకు మొత్తం టిఆర్ఎస్ నేతలే ఉలిక్కిపడుతున్నారు. ఎంపి పదవికి, పార్టీకి కొండా రాజీనామా చేయటం ఒక ఎత్తైతే కాంగ్రెస్ లో చేరుతుండటం మరో ఎత్తు. కనీసం ఎన్నికలు అయ్యేంత వరకైనా రాజీనామా చేయవద్దని కెటియార్ ద్వారా కెసియార్ ఎంతగా చెప్పించినా కొండా వినలేదు.

 

తాజాగా రేవంత్ చెప్పినట్లు రాజీనామాలు చేయనున్న మిగిలిన ముగ్గురు ఎంపిలు ఎవరనే విషయంలో టిఆర్ఎస్ లో పెద్ద చర్చే మొదలైంది. ఇద్దరు ఎంపిలు త్వరలో టిఆర్ఎస్ కు రాజీనామాలు చేయనున్నట్లు దాదాపు 15 రోజుల క్రితమే రేవంత్ చెప్పారు. అప్పట్లో ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే కొండా రాజీనామా చేశారో అప్పటి నుండో రేవంత్ గతంలో చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వచ్చింది. దానికితోడు ఇపుడు తొందరలో మరో ముగ్గురు ఎంపిలు కూడా రాజీనామాలు చేయనున్నట్లు రేవంత్ చేసిన ప్రకటనతో ఆ ముగ్గురు ఎవరని పార్టీ నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

 

ముగ్గురులో ఒకరు మహబూబా బాద్ ఎంపి సీతారామ్ నాయక్ అని ప్రచారం జరుగుతోంది. ఈ పేరు 15 రోజులుగా ప్రచారంలో ఉన్నా మిగిలిన ఇద్దరు ఎంపిలెవరో అంతు బట్టటం లేదు. మొత్తానికి ఎన్నికల సమయంలో కూడా కెసియార్ ను రేవంత్ వెంటాడి నిద్రలేకుండా చేస్తున్నారు. కెసియార్-రేవంత్ మధ్య వైరం ఈనాటికి కాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు నుండే మొదలైంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి కెసియార్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఓటుకునోటు కేసులో రేవంత్ పాత్ర ఆధారాలతో సహా బయటపడటంతో ఇద్దరి మధ్య వైరం బాగా ముదిరిపోయింది. అప్పటి నుండి ఒకరిని దెబ్బ కొట్టేందుకు మరొకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

అసెంబ్లీ నుండి రేవంత్ ను సస్పెండ్ చేయటం కూడా అందులో భాగమనే చెప్పాలి. మొత్తం మీద తెలంగాణాలో టిడిపి కనుమరుగయ్యే ప్రమాదాన్ని ముందే గ్రహించిన రేవంత్ కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. రేవంత్ ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి జంప్ చేశారో అప్పటి నుండి ఇటు కాంగ్రెస్ కు అటు రేవంత్ కు బాగా ఊపొచ్చింది. దాంతో ప్రతి విషయంలోను కెసియార్ తో పాటు కొడుకు కెటియార్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావులను వెంటాడుతున్నారు. నిజానికి రేవంత్ కు సరైన కౌంటర్ ఇవ్వటంలో పై నలుగురు చేతులెత్తేశారనే చెప్పాలి. ఇటువంటి పరిస్ధితుల్లో కెసియార్ కు షాకుల మీద షాకులివ్వటానికి రేవంత్ భారీ వ్యూహాన్నే అమలు చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఎన్నికలు ముగిసే సమయానికి రేవంత్ నుండి ఇంకెన్ని షాకులొస్తాయో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: