నందమూరి ఫ్యామిలీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ పరిస్థితి ప్రస్తుతం అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారు అయ్యింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ వయస్సులోనే స్టార్‌డ‌మ్‌ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్‌. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ పోలికలు అచ్చుగుద్దినట్టు ఉండడంతో పాటు కష్టపడేతత్వం ఇవన్ని కలిసి ఎన్టీఆర్‌కు తక్కువ టైమ్‌లోనే స్టార్డమ్‌ రావడానికి ప్రధాన కారణం అయ్యాయి. అయితే ఎన్టీఆర్‌కు అటు తన సొంత బాబాయ్‌ బాలకృష్ణతోనూ ఇటు మామ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోనూ ఆరేడేళ్లుగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. 2011 నుంచి వీరి మధ్య‌ గ్యాప్‌ క్రమక్రమంగా పెరుగుతు వచ్చింది. ఇదే టైమ్‌లో టోటల్‌గా అటు బాలయ్య, చంద్రబాబు హరికృష్ణ ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టారన్నది అప్పటి టాక్‌. 


2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు ఆ తర్వాత ఆయన్ను పక్కన పెట్టేశారన్న అభిప్రాయమూ ఉంది. 2014 ఎన్నికలకు ముందు సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ తన రాజ్యసభ పదవికి చంద్రబాబుకు చెప్పకుండానే రాజీనామా చెయ్యడం వీరిద్దరి మధ్య‌ అప్పటికే ఉన్న గ్యాప్‌న‌కు మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. 2014 తర్వాత టోటల్‌గా హరికృష్ణ ఫ్యామిలీకి చంద్రబాబు, బాలయ్యతో పూర్తిగా పొసగ‌ని పరిస్థితి వచ్చిందని ఆ పరిణామాలే చెప్పాయి. అయితే ఇటీవల హరికృష్ణ ఆకస్మిక మృతి తర్వాత జరిగిన పరిణామాలతో ఇప్పుడు మళ్ళీ హరికృష్ణ ఫ్యామిలీని చంద్రబాబు, బాలయ్య దగ్గరకి తీస్తున్నట్టు స్పష్టం అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలోకి దింపడం కూడా ఈ ఎత్తుగడలో భాగమే. 


అక్క సుహాసిని పోటీ చేస్తుండడంతో సోదరులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఇప్పటికే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే సుహాసిని తరపున జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తారా ? లేదా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు దీని గురించే టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్‌ ప్రచారం చేసినా ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు, ఎన్టీఆర్‌ను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు హరికృష్ణ ఆకస్మిక మృతి తర్వాత చంద్రబాబు, బాలయ్య ఆ కుటుంబాన్ని దగ్గరకు తియ్యడం ద్వారా రెండు సంకేతాలు పంపుతున్నారు. హరికృష్ణ ఫ్యామిలీపై సానుభూతి చూపించే ప్రయత్నం ఒకటి.


అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్పదన్నట్టుగా అయినా కూకట్‌పల్లిలో సోదరి నందమూరి సుహాసినీకి, వచ్చే ఎన్నికల్లో ఏపీలో తమకు ప్రచారం చేసే స్కెచ్‌ కూడా వీరు వేసినట్టు తెలుస్తోంది. ఏదైన ఎన్టీఆర్‌కు ఇప్పుడున్న పరిస్థితుల్లో తన సోదరి సుహాసినీకి, వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ప్రచారం చెయ్యడం ఇష్టమున్నా లేకపోయినా చంద్రబాబు వేసిన తాజా ఎత్తులతో ఆయన బలవంతంగా అయినా ప్రచారానికి వస్తారా ? లేదా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటారా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక మరో వైపు ఎన్టీఆర్‌ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ షూటింగ్‌లో బిజీ అయ్యారు. మరి ఎన్టీఆర్ డెసిషన్‌ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: