జనసేన పార్టీ మెల్లగా కుదురుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడడంతో సీనియర్లు పలువురు ఆ పార్టీలో చేరుతున్నారు. ఈ మధ్యనే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కండువా కప్పుకుంటే తాజాగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జై కొట్టారు. ఇపుడు మరికొంతమంది అదే వరసలో జనసేన వైపుగా వస్తున్నట్లు తెలుస్తోంది. 


హర్షకుమార్ అటువైపే :


అమలాపురం నుంచి వరసగా రెండు మార్లు ఎంపీగా గెలిచిన హర్షకుమార్ జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. జనసేనలో చేరాలనుకుంటున్నట్లుగా ఆయన మీడియాతో తాజాగా వెల్లడించడం విశేషం. తమ వర్గానికి సముచిత స్థానం, రాజకీయ భాగం ఇచ్చే పార్టీగా ఏపీలో జనసేన మాత్రమే ఉందని హర్షకుమార్ చెప్పడంతో ఆయన దాదాపుగా చేరేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. అమలాపురం పార్లమెంట్ స్థానంలో బలమైన నేతగా ఉన్న హర్షకుమార్ కనుక చేరితే అది జనసేనకు మంచి బూస్టప్ ఇచ్చినట్లుగా అవుతుందని అంటున్నారు.


ముద్రగడ అటువైపేనా:


ఇక మరో సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత కూడా జనసేన వైపుగా అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీలో కాపుల విషయంలో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పక్కన పెట్టనంతో ముద్రగడకు ఇపుడు జనసేన మాత్రమే ఆప్షన్ గా కనిపిస్తోందంటున్నారు. ఆయన బయటకు చెప్పకపోయినా ఆలొచనలు మాత్రం ఆ వైపుగా సాగుతున్నాయి. బయటపడితే పవన్ పార్టీకి కులం ముద్ర వస్తుందన్న తలంపుతోనే మౌనమే వ్యూహంగా మలచుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే జనసేనకు గోదావరి జిల్లాలో చాప కింద నీరులా మంచి బలమే సమకూరుతున్నట్లుగా అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: