కుకట్ పల్లి ఎన్నిక అత్తా కోడళ్ళ మధ్య సవాలుగా నిలిచింది.  భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కి మద్దతుగా బిజెపి సీనీయర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ప్రచారం చేస్తుండగా, మహాకూటమి తరపున టిడిపి అభ్యర్ధిగా చుండ్రు (నందమూరి) సుహాసిని పోటీ చేస్తున్నారు. పురంధేశ్వరి, సుహాసిని వరసకు మేనత్తా, మేనకోడలవుతారన్న విషయం తెలిసిందే. నందమూరి హరికృష్ణ, పురంధేశ్వరి అన్నా చెల్లెళ్ళని విషయం తెలిసిందే కదా. మల్కాజ్ గిరి అసెంబ్లీలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎంఎల్సీ రామచంద్రరావు తరపున పురంధేశ్వరి ప్రచారం చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ మహాకూటమి, టిఆర్ఎస్ అభ్యర్ధులిద్దరినీ చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

 

రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్, మహాకూటమి అభ్యర్ధులకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాలని సవాలు విసిరారు. భావసరూప్యత, సిద్ధాంతాలు లేని మహాకూటమి, అవినీతిలో కూరుకుపోయిన టిఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు. అభివృద్ధిని కోరుకుని తమ జీవితాలను బంగారుమయం చేసే కమలంపార్టీకే తమ ఓట్లు వేసి రామచంద్రరావును గెలిపించాలన్నారు. నరేంద్రమోడిని ఓడించేందుకు మాత్రమే మహాకూటమి, టిఆర్ఎస్ పోటీ పడుతున్నట్లు మండిపడ్డారు.  అయితే, నరేంద్రమోడిని ఎందుకు గద్దె దింపాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

నాలుగున్నరేళ్ళ పాలనలో మోడి పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. డబల్ బెడ్ రూం ఇళ్ళ పథకానికి కేంద్రం రూ 1170 కోట్లు ఇచ్చిందని, స్వచ్చత కోసం రూ 100 కోట్లు ఇచ్చినా ఫలితం కనబడలేదన్నారు. చివరగా కుకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మేనకోడలు సుహాసిని గురించి మాట్లాడుతూ ఆమె తన మేనకోడలే అయినా పార్టీ పరంగా బిజెపి అభ్యర్ధినే గెలిపించాలన్నారు. మేనత్తగా సుహాసినికి తన ఆశీస్సులుంటాయని, పార్టీ నేతగా తమ పార్టీ అభ్యర్ధినే గెలిపించాలని ఆమె చమత్కారంగా పిలుపిచ్చారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: