రాజకీయ క్రీడలో ఎవరు ముందుంటారో వెనక ఉంటారో అపుడే చెప్పలేము, మొదట వేగంగా పరుగులు తీసిన గుర్రం మధ్యలోనే అలసిపోయి ఆగిపోవచ్చు, నిదానంగా ఉన్న గుర్రమే గెలుపు అంచును తాకవచ్చు. రాజకీయాలు క్షణానికో విధంగా మారుతాయి. ఎంతటి వారైనా వాటిని ఔపాసన పట్టలేరు, గుట్టు పట్టేయలేరు. తెలంగాణాలో ఎన్నికల పోరు చూస్తే ఓ రేంజిలో సాగుతోంది.

కాడి వదిలేశారు :


తెలంగాణా తెచ్చిన కేసీయార్, ఉద్యమ కారుడు, వీరుడు అయిన నేత నోట ఓ మాట మొత్తం పరిస్థితిని తల్ల కిందులు చేసేలా ఉంది. ఓటమి అన్న మాట కలలో కూడా నాయకుని నోట రాకూడదు. బ్యాలెట్ బాక్సులో  ఆఖరి ఓటు వరకూ కూడా మేమే గెలుస్తామని చెప్పుకోవాలి. ఆ నిబ్బరం క్యాడర్లో కలిగించాలి. చూడబోతే గులాబీ బాస్ తీరు వేరేలా ఉంది. ఆయన మధ్యలోనే కాడి వదిలేసేలా ఉన్నారే. ఓడిపోతామని ఆయనే చెప్పుకుంటే ఇంక క్యాడర్ కి దిక్కు ఎవరు. నేను ఓడిపోతే నాకేంటి నష్టం ఇదీ కేసీయార్ తాజా మాట. ఇది ఇపుడు వైరల్ అయి మహా కూటమికి ఓ బ్రహ్మాస్త్రమే అందించింది.


కాపేసిన పందెం రాయుళ్ళు :


మహా కూటమికి ఇపుడు తెలంగాణాలో విజయావకాశాలు బాగా పెరిగాయాంటున్నారు. నామినేషన్ల ఉపసమ్హరణ తరువాత ఎన్నికల ముఖ చిత్రం ఓ రూపు సంతరించుకుంది. దాన్ని బట్టి చూసుకుంటే నిన్నటి వరకూ ధీమాగా కనిపించిన టీయారెస్ లో వణుకు మొదలైంది. అదే సమయంలో కూటమికి కొత్త బలం వచ్చింది. అంతా కలసి ఇపుడు కేసీయార్ కి వ్యతిరేకంగా జట్టు కట్టడం వల్ల జనంలోనూ ఆ వ్యతిరేక భావం మెల్లగా పాకుతోంది. ఈ సంగతి తెలిసే కేసీయార్ అంత మాట అన్సేశారు. నేను ఓడిపోయినా నాకేంటి బెంగ అంటూ ముందే తప్పుకున్నారా అన్నదే ఇపుడు ప్రచారంలోకి వచ్చేసింది. ఇదే సందు అంటూ పందెం రాయుళ్ళు ఇపుడు రంగంలోకి దిగిపోయారు.


కూటమికే ఎక్కువ బెట్టింగ్ :


నిన్నటి వరకూ కేసీయార్ వైపు బెట్టింగులు జోరుగా సాగాయి. మారిన పరిస్థితుల్లో ఇపుడు కూటమి మీద కూడా భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు. తెలంగాణాలో మహా కూటమి గెలుస్తుందంటూ కోట్లలో పందేలు కాయడం మారుతున్న రాజకీయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇపుడు పరిస్థితి ఎలా ఉందంటే టీయారెస్ తో సరి సమానంగా కూటమికీ విజయావకాశాలు ఉన్నాయని పందెం రాయుళ్ళు భావిస్తున్నారట. ఇంక ఎన్నికలకు రెండు వారాలు ఉంది. ఈ లోగా కూటామి మరింతగా ముందుకు దూసుకుపోతే అపుడు బెట్టింగులు ఆ వైపుగా  జోరందుకోవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: