తెలంగాణా ఇస్తే వెన్నంటి ఉంటానని చెప్పి తీరా రాష్ట్రం ఏర్పాటు చేశాక ఒంటరిగా పోటీ చేసి అధికారం హస్తగతం చేసుకుని  కాంగ్రెస్ ని కరివేపాకులా తీసిపారేసిన గులాబీబాస్ కేసీయార్  పై  కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధి  ఓ రేంజిలో  మండిపడ్డారు. నేరుగా పేరు పెట్టి అనకపోయినా విశ్వాస‌ఘాతకులతో పోల్చారు. మాట ఇచ్చి వెనక్కు పోయారని నిందించారు. అటువంటి వారిని మీరూ నమ్మొద్దంటూ  ఏకంగా తెలంగాణా సమాజానికే ఆమె పిలుపు ఇచ్చారు.


దాచుకున్న ఆక్రోశం :


తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అన్నది రాజకీయ నిర్ణయం. ఇవ్వడం ద్వారా ఇక్కడ రాజకీయంగా బలపడాలని కాంగ్రెస్ అనుకుంది. అందుకు చేసిన త్యాగం అంధ్రప్రదేశ్. తీరా రాష్ట్రం ఇచ్చాక కేసీయార్ హ్యాండ్ ఇస్తే ఇక్కడా, అక్కడా పోయింది. ఇన్నాళ్ళూ దాచుకున్న ఆవేదనను కేసీయార్ పై  ఉన్న  కసి, కోపాన్ని సోనియాగాంధి ఈ రోజు జరిగిన మేడ్చల్ సభలో వెళ్ళగక్కారు.

 సరైన సమయం చూసి టీయారెస్ అధిపతిపై నిప్పులే కురిపించారు. ఎంతో కష్టపడి తెలంగాణా ఇచ్చామంటూ నాటి సంగతులు ఆమె నెమరువేసుకున్నారు. తెలంగాణా వల్ల ఆంధ్రాకు అన్యాయం జరిగిందని కూడా సభాముఖంగా సోనియా అంగీకరించడం విశేష పరిణామమే. ఇలా తాము త్యాగాలు చేసి ఇచ్చిన తెలంగాణాను నాలుగున్నరేళ్ళలో టీయారెస్ పాడు చేసిందని సోనియా హాట్ కామెంట్స్ చేశారు. 


భవిష్యత్తు చీకటే :


టీయారెస్ ని నమ్మితే భవిష్యత్తు చీకటేనని సోనియా అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు వీటి గురించేగా తెలంగాణా కోరింది. మేము ఇచ్చింది, ఇవన్నీ ఇపుడు వచ్చాయా అంటూ మేడ్చల్ సభలో కడిగిపారేశారు. యువకులకు ఉపాధి లేదు. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, అభివ్రుధ్ధి అంత కంటే లేదు. ఇలాంటి తెలంగాణానా మనం కోరుకున్నది అంటూ జనం లో ఒకరిగా సోనియా నిలదీశారు. ఈ సర్కార్కు పాలించే అర్హత లేదు. తొందరగా ఇంటికి సాగనంపంపాల్సిందేనని పిలుపు ఇచ్చారు.


 తెలంగాణా కడగండ్లు తీర్చేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని కూడా ఆమె అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె భరోసా ఇచ్చారు. . తనకు తెలంగాణా వస్తే సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందని చెప్పి సెంటిమెంట్ పండించిన సోనియా తానే తెలంగాణాను ఇచ్చానని పదే పదే చెప్పుకోవడం ద్వారా రుణం తీర్చాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు గుర్తు చేశారు. మరో తెలంగాణా పోరాటం చేసి కేసీయార్ సర్కార్ని సాగనంపాలని, కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలని సోనియా కోరారు. 


మొత్తానికి మేడ్చల్ సభ ద్వారా కాంగ్రెస్ తరఫున సోనియాగాంధీ పూరించిన సమరశంఖం టీయారెస్ కి వణుకు పుట్టించేదిగానే సాగింది. మహా కూటమిని తక్కువ చేసి చూడాలనుకుంటే కుదిరే వ్యవహారం కాదని కూడా ఈ సభ చాటి చెప్పింది. కూటమి తొలి సభ విజయవంతం కావడం సెంటిమెంట్ తో ఓ వైపు, సెటైరల్తో మరో వైపు సోనియా చేసిన పవర్ ఫుల్ స్పీచ్ శుభారంభంగానే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: