’అవినీతి, దోపిడి వ్యవస్ధ మారాలంటే ఇటువంటి దోపిడి రాజకీయ నేతలు పనికిరారు. 2019లో జనసేన అధికారంలోకి రావాలి..పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి’..

పవన్ కల్యాణ్ తాజా కామెంట్లు వింటుంటే కర్నాటకలో కుమారస్వామి సిఎం అయిపోయినట్లుగానే తాను కూడా ఏపికి ముఖ్యమంత్రి అవుతానని  ఆశపడుతున్నారని అనిపిస్తోంది.  తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్నవారిలో అవే అనుమానాలు మొదలయ్యాయి. ఒకపుడేమో తనకు ముఖ్యమంత్రవ్వాలని కోరిక లేదన్నారు. అధికారంలోకి రావటం కోసమే తాను జనసేన పార్టీని పెట్టలేదని చెప్పారు. అంటే పై మాటలు చెప్పినపుడు చంద్రబాబునాయుడుతో కలిసున్నారు పవన్. అందుకే ముఖ్యమంత్రి పదవిని అప్పట్లో చంద్రబాబుకు వదిలేశారు. మరి ఇపుడెందుకు సిఎం అయిపోవాలని కలలు కంటున్నారంటే చంద్రబాబుతో కటీఫ్ చెప్పేశారు కాబట్టి.

 

పవన్ చెప్పిన మాటలపై కాస్త ఆలోచిద్దాం. నిజంగానే పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయా ? పార్టీ నిర్మాణం ఆ స్ధాయిలో ఉన్నదా ? పార్టీలో చెప్పుకోదగ్గ నేతలున్నారా ? ఇవన్నీ లాజికల్ పాయింట్లే. ఎందుకంటే, ఏ పార్టీకైనా నిర్మాణం చాలా కీలకం. పార్టీ నిర్మాణం గురించి ఆలోచిస్తే జనసేనకు అసలు పార్టీ నిర్మాణమే లేదన్నది వాస్తవం. పోనీ పార్టీలో చెప్పుకోతగ్గ నేతలున్నారా అంటే అదీ లేదు. జనసేన మొత్తం మీద వన్ టు టెన్ వరకూ చూసుకుంటే పవన్ తప్ప ఇంకోరు కనబడరు. కాబట్టి రేపటి ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో పవన్ తిరిగి ప్రచారం చేయాలంటే మామూలు విషయం కాదు.

 

’ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్నదట’  అనే సామెత లాగుంది పవన్ మాటలు. పార్టీ నిర్మాణం లేదు. పార్టీలో చెప్పుకోతగ్గ నేతలే లేరు. మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా దొరుకుతారో లేదో కూడా అనుమానమే. ఇటువంటి పరిస్దితుల్లో 2019లో పవన్ సిఎం అయిపోవాలట. మళ్ళీ 67 అసెంబ్లీలు, 8 ఎంపి సీట్లు గెలుచుకుని సామర్ధ్యాన్ని నిరూపించుకున్న జగన్ మాత్రం సిఎం అవ్వాలని కోరుకోకూడదట. అది కూడా దోపిడి, అవినీతిని పరుల నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవటానికట. నాలుగేళ్ళ పాటు చంద్రబాబునాయుడు అవినీతిని, అడ్డుగోలు దోపిడి గురించి పట్టించుకోని పవన్ ఇపుడు చంద్రబాబు అవినీతి, దోపిడి గురించి మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: