వైఎస్ జగన్ పట్టుదల ఏంటన్నది చాటి చెప్పిన ప్రజా సంకల్ప యాత్ర చిట్ట చివరి జిల్లాగా శ్రీకాకుళంలో  ఆదివారం అడుగుపెట్టబోతోంది. దాదాపు పదమూడు నెలలు, మూడు వందల రోజులు, మూడున్నర వేల కిలోమీటర్లు, 124 అసెంబ్లీ నియోజకవర్గాలు, కోట్లాది మంది జనంతో కదిలిన ఆ అడుగులు ఇపుడు శ్రీకాకుళంలో ప్రవేశిస్తున్నాయి. జగన్ అంటే ఓ నిబద్ధత, జగన్ అంటే మాట తప్పని నైజం, మడం తిప్పని వైనం. ఇలా అన్నీ జనం  ప్రత్యక్షంగా చూసేందుకు పాదయాత్ర వీలు కలిగించింది.


విజయనగరంలో 36 రోజులు :


జగన్ విజయనగరంలో  మొత్తం 36 రోజుల పాటు పాదయాత్ర నిర్హహించారు. మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేశారు. అన్ని చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎక్కడ చూసిన జనం బ్రహ్మరధం పట్టారు. జగన్ అడుగులో అడుగు వేస్తూ సాగారు. జగన్ సాలూరు పాదయాత్రలో ఉండగా అక్టోబర్ 25న ఆయనపై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగింది. ఇది ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ సంచలనం కలిగించింది. 


దాంతో మొత్తానికి 17 రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించిన జగన్ ఈ నెల 12 నుంచి మళ్ళీ పాదయాత్ర ప్రారంభించారు. హత్యాయత్నం తరువాత జగన్ పార్వతీపురంలో నోరు విప్పి తనపై కుట్ర చేసింది చంద్రబాబేనని చాటి చెప్పారు. కురుపాం మీటింగులో గిరిజనం జగన్ కి బ్రహ్మరధం పట్టారు. మొత్తం మీద జిల్లాలో జగన్ 370 కిలోమీటర్ల వరకూ తిరిగారు.


లక్ష్యానికి చేరువగా:


ఇక జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెడుతున్నారు. పాలకొండ వీరఘట్టం దగ్గర ఆయన జిల్లా పొలిమేరలను తాకనున్నారు. ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అన్నిటిలోనూ కవర్ అయ్యేలా జగన్ పాదయాత్ర షెడ్యూల్ డిజైన్ చేశారు. ఇద్దరు మంత్రులు, ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఉన్న సిక్కోలు నుంచి జగన్ సమర శంఖమే పూరించనున్నారు. తిత్లీ బాధితులను ఆయన పరామర్శించి ఓదార్చనున్నారు. మొత్తానికి ఆఖరు జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రవేశించింది. అనుకున్న లక్ష్యానికి చేరువ అయింది.


జనవరి 5 తో ముగింపు :


జగన్ పాదయాత్ర ముగింపు తేదీ కూడా నిర్ణయం అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 36 రోజుల పాటు ఆయన పాదయాత్ర సాగనుంది. కొత్త ఏడాది జనవరి 5 నాటికి జగన్ ఇచ్చాపురం చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగిస్తారు. సుదీర్ఘ పాదయాత్రకు సూచనగా స్మారక స్తూపాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద పాదయాత్ర ముగింపు దశకు చేరుకుందన్న ఉద్వేగంతో అపుడే వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని జగన్ ఏపీలో ఆవిష్కరించి ఈ తరానికి స్పూర్తిగా నిలిచారని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: