జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న కొన్ని కామెంట్స్ హీటెక్కిస్తున్నాయి. ఆయన అసలే ఆవేశపరుడు, దానికి తోడు ఇపుడు మరింతగా దట్టించి మరీ డైలాగులు వదులుతున్నారు. ఇక ఆయన బహిరంగ సభల్లో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు అభిమానులు  ఎలా తీసుకుంటారన్న దానిపైన సర్వత్రా చర్చ సాగుతోంది. ఏపీలో ఈ తరహా రాజకీయాలు గతంలో ఎన్నడూ జరగలేదని అంటున్నారు.


ఆయనే టార్గెట్:


పవన్ గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ని టార్గెట్ చేశారు. ఆయనలా నేను ఉండను, ఆయన పిరికివాడు, ప్రజా సమస్యలు పట్టవు, ఆయన అవినీతిపరుడు, అధికారంలోకి వస్తే మొత్తం దోచేస్తాడు అంటూ పవన్ ప్రతీ రోజూ విమర్శలు చేస్తున్నారు. అంతెందుకు చెన్నై వెళ్ళి అక్కడ కూడా పవన్ ఇవే విమర్శలు చేశారు. నిజానికి జగన్ పవన్ ని ఒక్క మాట కూడా అనడంలేదు. మరి పవన్ ఎదుకిలా అటాక్ చేస్తున్నాడు. అంటే తాజా సర్వేలు సైతం జగన్ గెలుపుపైన పూర్తిగా అనుకూలంగా ఉండడం, అదే సమయంలో తన పార్టీ పెద్దగా స్కోర్ చేయలేకపోవడం వంటి కారణాలతోనే పవన్ ఇలా విరుచుకుపడుతున్నారని అంటున్నారు.


గెలుపుపై అనుమానమా:


నిజానికి పవన్ ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. అప్పటి వరకూ ఆయన అడపా దడపానే మీటింగులు పెట్టుకొచ్చారు. ఆ తరువాత టీడీపీ బంధం వీడి ఆయన సొంత రాజకీయం మొదలుపెట్టారు. అప్పట్లో పవన్ అనుకుని ఉంటారు. తాను డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చేస్తే జనం బ్రహ్మరధం పడతారాని. నిజమే అలా జరిగేదేమో కానీ పవన్ పర్యటనలు  అన్నీ కామాలు, ఫుల్ స్టాపులతో సాగాయన్న విమర్శలు ఉన్నాయి.


 పైగా ఆయన ప్రసంగాలు సైతం పెద్దగా ఆకట్టుకోకపోవడం, దేనిపైనా  కూడా నిర్దిష్ట విధానం లేకపోవడం వంటి కారణాల వల్ల పవన్ మీద జనాలకు కొత్తలో ఉన్న మోజు తగ్గిందనంటున్నారు. ఇక ఏపీలో మరో వైపు టీడీపీ కూడా కేంద్రంతో దోస్తీ కట్ చేసుకుని జోరు పెంచింది. జగన్ పాదయాత్రకు ఎటూ మంచి స్పందన వస్తోంది. ఇలా రెండు బలమైన పార్టీలూ ఎక్కడ చోటు ఇవ్వకుండా ముందుకు దూసుకుపోవడంతో పవన్ పార్టీకి రావాల్సిన మైలేజ్ రాలేదనే చెప్పాలి. ఈ పరిణామాలు సహజంగా ఆయనలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచాయని అంటున్నారు


 ఇక ఏపీలో టీడీపీ కంటే వైసీపీ ముందు ఉండడంతో ఆ పార్టీని టార్గెట్ చేస్తే రాజ‌కీయంగా ప్రయోజనం ఉంటుందన్న సలహాల మేరకే జగన్ మీద పవన్ ఇపుడు మాటలతో దాడి చేస్తున్నరని అంటున్నారు. మొత్తానికి పవన్ పార్టీ గత ఎనిమిది నెలల ప్రస్తానం మాత్రం జనసేనానికే సంత్రుప్తి ఇవ్వలేదని ఆయన వ్యవహార శైలిని బట్టే అర్ధమవుతోందని అంటున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: