వైఎస్ జగన్ ఈ రోజు పాదయాత్ర చిట్ట చివరి జిల్లా శ్రీకాకుళం చేరనుంది. వీరఘట్టం మీదుగా జగన్ సాయంత్రానికి సిక్కోలు గడప తొక్కుతారు. అందుకోసం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏపీలో కూడా ఆఖరుదైన ఈ జిల్లాలో రాజకీయం వాడి వేడిగా ఉంటుంది. దాంతో జగన్ పాదయత్రకు కూడా అనూహ్యంగా  ప్రాధాన్యం పెరిగింది.


కంచుకోటలోకి :


శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం ఇప్పటికైతే అధికార పార్టీకి అనుకూలంగా ఉంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఏకంగా ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట రావు  కూడా ఈ జిల్లా నుంచి ఉన్నారు. ఇక మాటలతో బాంబులు పేల్చే మంత్రి అచ్చెమ్నాయుడు ఎటూ ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఇక్కడ కాంగ్రెస్ జెండా అంతగా ఎగరలేకపోయింది. అయితే వైఎస్ మాత్రం మొత్తం పరిస్థితిని మార్చేశారు. ఆయన సీఎం గా ఉన్నపుడు రెండు మార్లు  సిక్కోలు జేజేలు పలికింది. అదే అభిమానం ఇపుడు తనయుడి పార్టీకి కూడా దక్కుతుందా అని అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. 


రెండు పార్టీలూ పోటా పోటీ:


ఇదిలా ఉండగా జగన్ పాదయాత్రను అడ్డుకుంటామని అపుడే టీడీపీ నేతలు ప్రకటించారు. నెల రోజుల క్రితం వచ్చిన తిత్లీ తుపాన్ సందర్భంగా జిల్లాలోని లక్షలాది ప్రజలు నిరాశ్రయులైతే జగన్ వారిని కనీసం పరామర్శించలేదన్ తమ్ముళ్ళు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జగన్ తాను చేసిన తప్పుకు క్షమార్పణ చెప్పిన తరువాతనే ఇక్కడ అడుగు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధిచిన హోర్డింగులు కూడా టీడీపీ నేతలు ఎక్కడికక్కద పెట్టారు. సహజంగానే టీడీపీ కార్యకర్తలతో జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు కూడా రంగం సిధ్ధం చేస్తూండడంతో వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ నేతలు కూదా రెడీ అయిపోయారు. ఈ పరిణామాలతో సిక్కోలు ఉద్రిక్తంగా మారుతోంది. రాజకీయ దుమారం రేగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


జగన్ కి భద్రత :


మారుతున్న రాజకీయం గమనించిన పోలీసులు జగన్‌ పాదయాత్రకు పోలీసులు జడ్‌ప్లస్‌ భద్రత కల్పించనున్నారు. తితలీ తుపాను బాధితులను పరామర్శించలేదని జగన్‌పై నేరుగా ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడి హోదాలోను, ఇటు రాష్ట్ర ప్రతి పక్ష నాయకుడి హోదాలోను జగన్‌కు జడ్‌ప్లస్‌ భద్రత కల్పిస్తారు. ప్రతిరోజూ ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 60 మంది ఏఎస్‌ఐలు, సివిల్‌ పోలీసులు పాదయాత్రలో భద్రత కల్పించనున్నారు. దీనితో పాటు ప్రత్యేకభద్రతలో భాగంగా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, సాయుధ దళాలు, మహిళా పోలీసులు, హోమ్‌గార్డ్స్‌ నిరంతరం రక్షణగా ఉంటారు.
 పాదయాత్రలో ఎక్కడా అపశ్రుతి దొర్లకుండా వారంతా పూర్తి అప్రమత్తతతో ఉంటారని అంటున్నారు. కాగా జగన్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు వైసీపీ సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకరరెడ్డి అపుడే సిక్కోలు చేరుకున్నారు. మొత్తానికి జగన్ సిక్కోలు పాదయాత్ర ఉత్కంఠను రేపే అవకాశలు అధికంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: