ఏపీ విప‌క్షం వైసీపీ చ‌ర్య‌ల‌తో టీడీపీకి చిర్రెత్తుకొస్తోంది. ఏపీలో చేస్తున్న రాజ‌కీయాలు చాల‌వాఅని.. ఇప్పుడు తెలంగాణాలోనూ వైసీపీ టీడీపీ వ్య‌తిరేక రాజ‌కీయాల‌కు తెర‌దీసింది. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోనే వైసీపీ.. టీడీపీ వ్య‌తిరేక ప్ర‌చారానికి దిగ‌డం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. నిజానికి తెలంగాణా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎక్క‌డా పోటీ చేయ‌డం లేదు. దీనికి ఏ కార‌ణాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలంగాణా సీఎం కేసీఆర్‌తో జ‌గ‌న్‌కు అవినాభావ సంబంధాలున్నాయ‌నేది రెండు రాష్ట్రాలు ఎరిగిన స‌త్యం. అయినాకూడా ఎక్క‌డా నేరుగా టీఆర్ ఎస్ కుకానీ, కేసీఆర్‌కు కానీ, జ‌గ‌న్ బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం లేదు. అంతేకాదు .. ఎక్క‌డా తెలంగాణాలో వైసీపీ జెండా కానీ, నాయ‌కుడు కానీ క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో హ‌ఠాత్తుగా ఇప్పుడు కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జెండాలు తెర‌మీద‌కి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. 


ఏపీ వాళ్లు ఎక్కువ‌గా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అంతేకాదు, ఇక్క‌డ నుంచి పోటీ చేద్దామ‌ని భావించిన సీనియ‌ర్ నాయ‌కుడు, చంద్ర‌బాబుకు మిత్రుడు అయిన పెద్దిరెడ్డిని కాద‌ని, త‌న బావ‌మ‌రిది.. దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె.. సుహాసినికి అవ‌కాశం ఇచ్చారు. ఈమె గెలుపు ఇక్క‌డ నంద‌మూరి ఫ్యామిలీకి ప్ర‌తిష్టాత్మ‌కం. దీంతో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. రేపో మాపో ఇక్క‌డ నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు సైతం ప్ర‌చారానికి రెడీ అవుతున్నారు. కానీ, ఇంత‌లో.. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా కూకట్‌పల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. 


తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ సింగిల్‌గా వస్తున్నారని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫొటోలను బ్యానర్లపై ముద్రించడాన్ని కూడా వారు తప్పుబట్టారు.  వైఎస్ బొమ్మ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వైఎస్ అవినీతిపరుడని కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, రాహుల్ ప్రచారానికి వస్తామంటున్నారని.. ముందు వైఎస్‌పై వాళ్లిద్దరూ అభిప్రాయం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు జై కేసీఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 


టీఆర్‌ఎస్‌తో పాటు వైసీపీ నేతలు కూడా కష్టపడి మహాకూటమిని ఓడించాలని సమావేశంలో వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. మొత్తానికి ఈ ప‌రిణామం.. సుహానికి ఎర్త్ పెడుతుందా?  అనే కోణంలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోప‌క్క‌, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రైనా రంగంలోకి దిగుతారా? అనే ప్ర‌శ్న ఉద‌యించింది. అయితే, ప్ర‌చారానికి రాక‌పోయినా.. ప్ర‌క‌ట‌న‌లు మాత్రం గుప్పించే అవకాశం ఉంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. సుహాసిని టార్గెట్‌గా వైసీపీ వ్యూహం ప‌న్నితే.. బాబుకు ప‌రీక్షే అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: