ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీకి రాజీనామా చేశారు. మరో 13 రోజుల్లో పోలింగ్ జరుగనున్న సందర్భంగా ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేయటం పార్టీలో కలకలం రేపుతోంది. కారణాలు స్పష్టంగా తెలియటం లేదుకానీ బేగ్ చాలాకాలంగా టిఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా అయిన బేగ్ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల వేడి రాజుకున్న తర్వాత బేగ్ తో మహాకూటమి నేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం.


టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉన్న బేగ్ మొన్నటి వరకూ పార్టీలో బాగానే యాక్టివ్ గా ఉన్నారు. ముందస్తు ఎన్నికల వాతావరణం మొదలైన తర్వాత నుండి బేగ్ లో మార్పు కనబడింది. బహుశా ఖమ్మం నుండి పోటీ చేయాలనుకుని బేట్ భంగపడినట్లుంది. దాంతో పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. అదే అదునుగా మహాకూటమి తరపున టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు బేగ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. వాళ్ళమధ్య చర్చలు సానుకూలమైనట్లే ఉంది. అందుకే బేగ్ రాజీనామా చేస్తున్నట్లున్నారు.

 

బేగ్ రాజీనామా విషయం బయటకు పొక్కగానే పార్టీ అగ్రనేతలు బేగ్ తో మాట్లాడేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపింది. కాగా నామాతో మంతనాల తర్వాత బేగ్ తెలుగుదేశంపార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో టిఆర్ఎస్ తరపున తాజా మాజీ పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేస్తుంటే మహకూటమి అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే కావటం గమనార్హం.

 

అయితే, ఇక్కడ ముస్లిం మైనారిటీల సంఖ్య కూడా బాగానే ఉంది. అందుకే టిడిపి బేగ్ ను దువ్వుతోందని సమాచారం. ఈరోజు సాయంత్రం బేగ్ తన రాజానీమా విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని బేగ్ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల వేడి బాగా రాజుకున్న తర్వాత పార్టీకి ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంఎల్సీ యాదవరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా బేగ్ రాజీనామా తోడయ్యింది. పోయిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక్కస్ధానంలో మాత్రమే విజయం సాధించింది. అందుకే ఈసారి కెసియార్ ప్రత్యేక దృష్టి సారించారు. మరి ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాల్సిందే. ఇంకెంతమంది నేతలు రాజీనామాలు చేయనున్నారో అన్న టెన్షన్ గులాబీ పార్టీలో ఎక్కువైపోతోంది. 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: