ఏపీలో విపక్ష నాయకుడు వైఎస్ జగన్ ది ప్రత్యేక తరహా రాజకీయం. ఆయన నమ్ముకున్నదే చేస్తారు. వర్తమానాన్ని, వాస్తవ రాజకీయాన్ని ఆయన గమనంలోకి తీసుకోరని పార్టీ నేతలే చెబుతూంటారు. ఇందుకు గానూ జగన్ బాగా నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నా ఆయన మాత్రం మారరంతేనని అంటారు. ఇపుడు కూడా జగన్ వేస్తున్న అడుగులు అలాగే ఉన్నాయని అంటున్నారు. ఆయన అప్రమత్తం కాకపోతే భారీ నష్టమే మరో మారు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.


బీజేపీతో లాలూచీ :


నిజానికి ఏపీలో బీజేపీని నెత్తిన పెట్టుకున్నది, మంత్రి పదవులు అనుభవించినది, నాలుగేళ్ళ పాటు కాపురం చేసినది టీడీపీ, ఎపుడైతే బీజేపీ, మోడీ గ్రాఫ్ అలా పడిపోతున్నట్లుగా గ్రహించిందో అపుడే తెలివిగా గుడ్ బై చెప్పేసి బయటకు వచ్చేసింది పసుపు పార్టీ. నాటి నుంచి కొత్త ప్రచారం మొదలెట్టింది. బీజేపీతో వైసీపీ కుమ్మక్కు అవుతోందన్నదే ఆ ప్రచారం. ఇది జరిగి ఎనిమిది నెలలు గడుస్తోంది. ప్రతీ రోజు చంద్రబాబు నుంచి బూత్ లెవెల్ కార్యకర్త వరకూ ఇదే టాపిక్ తో జనాల్లోకి వెళ్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని చాలా పెద్ద ఎత్తువ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో వైసీపీ నుంచి కనీస మాత్రమైన స్పందన లేకపోవడం విశేషం.


నమ్మరని ధైర్యమా :


జగన్ పై ఇదే తరహాలో 2014లో టీడీపీ, దాని అనుకూల పత్రికలు కాంగ్రెస్ తో లింక్ కట్టి ప్రచారం చేశాయి. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ చేసిన ఆ ప్రచారాన్ని జనం బాగా నమ్మారు. జగన్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడానికి అది కూడా ఓ కారణమే. జగన్ నాడు మొండిగా ఉంటూ టీడీపీని ఎవరూ నమ్మరని భావించడం వల్లనే అంతటి అనర్ధం జరిగింది. ఇపుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు బీజేపీతో జగన్ని కలిపేస్తున్నారు. ఇది నాడు చేసిన చేటు కంటే ఎక్కువ ప్రమాదం చేసే అవకాశం ఉంది. బీజేపీతో లాలూచీ అంటే వైసీపీ  ఓటు బ్యాంక్ మొత్తం గల్లంతవుతుంది. తెలివిగా టీడీపీ ఆడుతున్నా ఈ ఎత్తుగడల రాజకీయాన్ని వైసీపీ తిప్పికొట్టకపోగా మౌనంగా ఉండడం ఆమోదించడమేనని అంటున్నారు.


అతి ధీమా :


టీడీపీ అధినేతపై జనంలో విశ్వాస్వం లేదు. ఆయన్ని జనం నమ్మరు, ఇదీ జగన్ ఆలోచించే తీరు. అలా అనుకున్నా చంద్రబాబు రోజుకో జిమ్మిక్కుతో జనాలను ఏమారుస్తున్నారు కదా. ఆయనకు తాళం వేసే అనుకూల మీడియా పెద్ద బలం కదా. దాన్ని గుర్తించైనా జగన్ మేలుకోకపోతే జనం బాబు చెప్పేదే  నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. ఇప్పటికైతే సాదర జనం కూడా జగన్ బీజేపీ కలుస్తారేమోనని మాట్లాడుకుంటున్నారు. మైనారిటీలు, దళితులు ఓటు బ్యాంక్ గా ఉన్న వైసీఎపీ ఇపుడైనా తేరుకుని ఖండించకపోతే అసలుకే ఎసరు వస్తుందని తల పండిన వైసీపీ సీనియర్లు చెబుతున్నారు. మరి జగన్ ఎమంటారో.



మరింత సమాచారం తెలుసుకోండి: