రాజకీయాల్లో ఇది జరగాలి. ఇది జరగ‌దు అన్న రూలేమీ లేదు. ఎందుచేతనంటే అధికారమే పరమావధి కాబట్టి. ఇదివరకు మాదిరిగా పార్టీలు, సిధ్ధాంతాలు కూడా ఎక్కడా లేవు. ఎవరికి ఎపుడు బాగుంటే అది చేస్తారు. ఎవరితో కలిస్తే నాలుగు ఓట్లు వస్తాయో ఆ వైపుగా చేరిపోతారు. ఇపుడున్న రాజకీయ వ్యవస్థలో ఎవరూ దీనికి అతీతులు కారు. అలా ఉన్న వాళ్ళు రాజకీయాలకు కూడా పనికిరారు.


మహా కూటమిలోకి :


ఈ మాటలు అన్నది బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసిమ్హారావు. ఆయన రాజకీయ ఆరోపణల్లోభాగంగా ఇలా అన్నాడనుకున్నా దీని వెనక లాజిక్ ఎంతో ఉంది. ఎన్నికల వరకే పార్టీలు, ఫలితాలు వచ్చిన తరువాత కొద్ది గంటల్లోనే బీజేపీ తప్ప అంతా ఒక్కటి అవుతారు అంటూ జీవీఎల్ చెప్పిన దాంట్లో అసత్యం, అతిశయోక్తి కూడా ఏమీ కనిపించడం లేదు. ఆ వైపుగా అలోచన చేస్తే అదే జరుగుతుందేమోననిపిస్తుంది. దానికి ఉన్న అవకాశాలను కూడా ఒక్కసారి పరిశీలిద్దాం.


టీయారెస్ కి మెజారిటీ రాకపోతే :


రేపటి తెలంగాణా ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి  మెజారిటీకి టీయారెస్ దూరంగా ఉంటే అపుడు రాజకీయం అచ్చం జీవీఎల్ చెప్పినట్లే జరుగుతుంది. అప్పటి వరకూ ఉన్న శత్రుత్వం మరచి కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు కేసీయార్ రెడీ అవుతారన్నది కూడా కాదనలేం. ఆయన‌కు ఇక్కడ మద్దతు ఇచ్చి రేపటి లోక్ సభ ఎన్నికల్లో టీయారెస్ మద్దతు తీసుకుని పోటీ చేసేందుకు కాంగ్రెస్ రెడీ కూడా కావచ్చు. ఆ విధంగా కేసీయార్ కి వ్యతిరేకంగా కట్టిన మహా కూటమి రేపటి అవసరాల ద్రుష్ట్యా  బీజేపీ వ్యతిరేక కూటమిగా మారిపోవచ్చు.


టీడీపీ సైతం :


అదే కనుక జరిగితే టీడీపీ సైతం కేసీయార్ తో చేతులు కలిపేందుకు ఏ మాత్రం మొహమాటపడదని కూడా అంటున్నారు. టీయారెస్ సారధ్యంలోని ప్రభుత్వంలో టీడీపీ చేరినా ఆశ్చర్యం ఎవరికీ ఉండదు. బాబు మెడ మీద కత్తిలా ఉన్న ఓటుకు నోటు కేసు మాఫీ కావడమే టీడీపీ అసలైన లక్ష్యం. ఆ లక్ష్య  సాధనకు కలసివస్తే కేసీయర్ ని సపోర్ట్ చేయడానికి కూడా సైకిల్ పార్టీ  ఎపుడూ రెడీగానే ఉంటుంది. ఇలా ఇపుడు కుమ్ములాడుకుంటున్న పార్టీలన్నీ ఎన్నికల తరువాత ఒక్కటి అవుతాయని జీవీఎల్ చెప్పినది జోస్యం ఏమీ కాదు, అవకాశ వాదం గురించి ఆయన చెప్పిన మాట మాత్రమే.


ఏపీలోనూ :


ఇక తెలంగాణాలో కూటమి, కేసీయార్ ఎన్నికల తరువాత కలసిపోయి మోడీకి వ్యతిరేకంగా జెండా ఎత్తితే ఏపీలోనూ సమీకరణలు మారిపోతాయి. ఏ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటూ తెలంగాణాలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న టీయారెస్ కి వైసీపీ మద్దతుగా ఉందో రేపు అదే మద్దతు ఇక్కడ జగన్ కు టీయారెస్ నుంచి లభించదు. ఎందుచేతనటే అప్పటికే టీయారెస్ ఎన్నికల తీరాన్ని దాటేసి సేఫ్ గా ఒడ్డుకు చేరుకుంటుంది కాబట్టి. అందువల్ల తెలంగాణాలో పోటీ చేసి తన సత్తాను నిరూపించుకుంటే వైసీపీకి తెలంగాణా రాజకీయాల్లో  కొంత బేస్ ఉండేది. ఏదేమైనా రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కటి మాత్రం చెప్పగలరు అందరూ అధికారం కోసం అర్రులు చాచేవారని, అందుకోసం ఎలాగైనా కలిసేవారని.


మరింత సమాచారం తెలుసుకోండి: